
సన్నీతో ఫొటోకి ప్రియాంక నో!
‘‘ఆహా! ప్రియాంక ఎంత బాగా ప్లేట్ ఫిరాయించింది... నటిగా మాత్రమే నంబర్ వన్ కాదు.. మాట మార్చడంలో కూడా నంబర్ వన్నే.. ఎంతైనా బాగా తెలివైన పిల్లే...’’ అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా తెలివితేటలు గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణం ఇటీవల జరిగిన ఓ ఆడియో వేడుక. ఆ వేడుకలో పలువురు తారలు పాల్గొన్నారు. వాళ్లల్లో ప్రియాంకా చోప్రా, సన్నీ లియోన్ ఉన్నారు.
ఈ ఇద్దరూ ఒకేసారి వేడుక ప్రాంగణంలో ప్రత్యక్షం కావడంతో, ఇద్దర్నీ కలిపి ఫొటో తీద్దామనుకున్నారు ఫొటోగ్రాఫర్లు. ‘ఒక్క ఫొటో’ అని ప్రియాంకను వాళ్లు అడిగితే, ‘ఆమెతో ఫొటో వద్దు’ అని హిందీలో అన్నారట. సన్నీతో ఫొటో దిగితే తన రేంజ్ పడిపోతుందని ప్రియాంక భావించినట్లున్నారు. సన్నీకి హిందీ అర్థం కాదు కాబట్టి, ఆ భాషలో చెప్పారని పరిశీలకులు ఊహిస్తున్నారు. కానీ, సన్నీకి అర్థం చెప్పేవాళ్లు ఉంటారు కదా.. వాళ్లు ఈ హాట్ బ్యూటీ చెవిలో అసలు విషయం పడేశారు. దాంతో సన్నీ మనసు గాయపడింది.
ఏదైతేనేం చివరకు సన్నీ, ప్రియాంక ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. కానీ, సన్నీ పట్ల ప్రియాంక అలా వ్యవహరించినందుకు కొంతమంది తూలనాడారట. మౌనంగా ఉంటే బ్యాడ్ అయిపోతానని గ్రహించిన ప్రియాంక ‘‘సన్నీ అందం ముందు నేనెందుకూ పనికిరాను. అందుకే ఆమెతో ఫొటో దిగనన్నాను. అంతే కానీ ఇష్టంలేక కాదు. సంచలనం కోసం నా స్టేట్‌మెంట్‌ని మీడియావాళ్లు వక్రీకరించారు’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అందుకు బదులుగా ‘‘నీ మాటలకు అర్థం నాకు తెలిసింది. మీడియానే ఏవేవో సృష్టించింది’’ అని సన్నీ ట్వీట్ చేశారు. ముందు నోరు జారి, అభాసుపాలవుతానని గ్రహించిన ప్రియాంక తెలివిగా తప్పంతా మీడియాపై నెట్టేశారని పరిశీలకులు గ్రహించారు. కానీ, ఆ మాట ప్రియాంకతో అంటే ఒప్పుకుంటారా?