
'తుఫాన్'పై ఎక్కువ అంచనాలొద్దు: రామ్ చరణ్
'జంజీర్' సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దంటున్నాడు హీరో రామ్ చరణ్. తన నుంచి ఎక్కువ ఆశించొద్దని కోరాడు.
'జంజీర్' సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దంటున్నాడు హీరో రామ్ చరణ్. తన నుంచి ఎక్కువ ఆశించొద్దని కోరాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన దాంట్లో తాను 10 శాతం చేసుంటానని వినయంగా ఒప్పుకున్నాడు. బిగ్ బి చేసిన పాత్ర చేయడం ఒత్తిడితో కూడుకున్నదే కాకుండా, కొంచెం కష్టం కూడానని పేర్కొన్నాడు. క్రమశిక్షణ, బాధ్యతతో 'జంజీర్'లో నటించానని చెప్పాడు. ఈ సినిమాకు పనిచేయడం తనకు అడ్వాంటేజ్ అవుతుందని తెలిపాడు.
1973లో వచ్చిన 'జంజీర్' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం మొదటి రోజు షూటింగ్లో అమితాబ్ను కలిసినప్పుడు తాను కొంచెం టెన్షన్ పడ్డానని రామ్ చరణ్ చెప్పాడు. అయితే ఆయన తనను దీవించడంతో తమకు బలం వచ్చినట్టయిందని అన్నాడు. అమితాబ్ నుంచి ఎటువంటి సూచనలు, సలహాలు తీసుకోలేదన్నాడు. తమ చిత్రం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారని వెల్లడించాడు.
'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రం విడుదలకు ఆటంకాలు ఎదురుకానున్నాయని వచ్చిన వార్తలను రామ్ చరణ్ తోసిపుచ్చాడు. రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న మాట వాస్తమే అయినా తమ చిత్రం విడుదలకు ఎటువంటి అడ్డంకులు ఉండబోమని ఆశాభావం వ్యక్తం చేశాడు.