సీమాంధ్రలో 'తుఫాను'కు అడ్డంకి
హైదరాబాద్ : కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి తనయుడు రామ్చరణ్ తాజా చిత్రం 'తుఫాన్'కు సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర జిల్లాల్లో చిత్ర ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, ఏలూరు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉదయాన్నే థియేటర్ల వద్దకు చేరుకున్న సమైక్యవాదులు చిత్ర ప్రదర్శనను అడ్డుకుని, పోస్టర్లు చించివేశారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు థియేటర్ల యజమానులు కూడా చిత్రాన్ని ప్రదర్శించేందుకు జంకుతున్నారు.
మరోవైపు తుఫాన్ కు సీమాంధ్ర, తెలంగాణల్లో విభిన్న కోణాల్లో ఉద్యమ సెగ తగులుతోంది. తుఫాన్ చిత్రాన్ని సీమాంధ్రలో సమైక్యవాదులు అడ్డుకుంటుంటే , చిరంజీవి సమైక్యవాదంటూ సినిమాను ఆడనివ్వబోమంటు తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. ఇరుప్రాంతాల నిరసన మధ్య తుఫాన్ ఇవాళ రిలీజ్ అవుతోంది.
ఉత్తరాంధ్రలో తుఫాన్ ఆడాలంటే చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర జేఏసి డిమాండ్ చేసింది. విజయనగరం పట్టణంలోని మయూరి సెంటర్లో చిరంజీవి తీరును నిరసిస్తూ సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. సినిమా పోస్టర్లు ఫ్లెక్సీలను చించి దహనం చేశారు. రామ్ చరణ్ చిత్రంతోపాటు చిరంజీవి కుటుంబంలోని ప్రతి ఒక్కరి చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలోనూ తుఫాన్ సినిమాకు ఉద్యమ సెగ తగిలింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో చిరంజీవి తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహించారు. థియేటర్ వద్ద తుఫాన్ చిత్రం పోస్టర్లను దగ్ధం చేశారు. చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నారని అందువల్లే రామ్ చరణ్ చిత్రాన్ని అడ్డుకుంటామని అడ్వకేట్ జేఏసి హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలతో ఇరు ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో పోలీసులు భారీ బందోస్తులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసుల రక్షణలో తుఫాను చిత్రం ప్రదర్శితం కాబోతోంది.