
తమిళసినిమా : కోలీవుడ్ స్టార్ నటులు టాలీవుడ్‌లో రాణించడానికి తహ తహలాడుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్, కమలహాసన్ లాంటి నట దిగ్గజాల చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. వారిని పక్కన పెడితే సూర్య, కార్తీ, విశాల్, ఆర్య, భరత్ లాంటి యువ స్టార్స్ టాలీవుడ్‌లో సుపరిచితులుగా మారారు. వీరి చిత్రాలకు అక్కడ వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టి ఇటీవల కోలీవుడ్‌పై పడింది. ఇప్పటికే నాగార్జున లాంటి కొద్దిమంది తమిళ చిత్రాల్లోనూ నటించి పేరు తెచుకున్నారు. అదే విధంగా మహేశ్, ప్రభాష్, రానా లాంటి నటులు తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ కోలీవుడ్‌లోనూ విజయం అందుకున్నారు.
మహేశ్‌బాబు నటించిన స్పైడర్ ఆయన్ని నిరాశపరచింది. అల్లుఅర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కోలావుడ్‌లో మార్కెట్ పెంచుకోవాలని ఆరాటపడుతున్నారు. ప్రభాస్‌ను కోలీవుడ్‌కు స్ట్రెయిట్ చిత్రం ద్వారా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను కోలీవుడ్‌కు తీసుకొస్తున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న మల్లీస్టారర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ రూపొందించనున్నట్టు తాజా సమాచారం. దీన్ని ఆయన ఇద్దరు బాక్సర్ల కథా చిత్రంగా తీర్చిదిద్దనున్నారు. కథను విజయేంద్రప్రసాద్ అందిస్తున్నారు. ఇతర వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.