
మనిషి ఎలాంటి వాడు?
మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలు, మలుపులు, గుణాల నేపథ్యంలో సాగే కథతో రాధాస్వామి ఆవుల దర్శకత్వం వహించిన చిత్రం
మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలు, మలుపులు, గుణాల నేపథ్యంలో సాగే కథతో రాధాస్వామి ఆవుల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ మనిషి కథ’. జగపతిబాబు, కల్యాణి జంటగా బాలా భాయ్ చొవాటియా నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల పాటలు స్వరపరిచారు. రాధాస్వామి ఆడియో సీడీని ఆవిష్కరించి రచయిత సుద్దాల అశోక్‌తేజకి ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథతో పాటు సినిమాపట్ల నాకున్న అపరిమితమైన ప్రేమనుచూసి జగపతిబాబు గారు ఈ సినిమా చేశారు. నిర్మాత కూడా కథను నమ్మారు. మూడక్షరాల మనిషిలో ఉన్న మూడు గుణాలను బట్టి, అతనెలాంటివాడో నిర్ణయిస్తాం.
ఈ విషయానికి పలు వాణిజ్య అంశాలు జోడించి, ఈ సినిమా చేశాం. విజయ్ కురాకుల మంచి పాటలిచ్చారు. సుద్దాల రాసిన సాహిత్యం అద్భుతం’’ అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్‌తో తనకు సంబంధం లేదనీ, కథే తనకు ముఖ్యమని నిర్మాత ఈ చిత్రం చేశారని అశోక్‌తేజ చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని విజయ్ కురాకుల తెలిపారు. ‘సీత లేని రామ కథ ఇంతేనమ్మా..’ అనే పాటకు జాతీయ అవార్డు వస్తుందని ‘ఆదిత్య’ సత్యదేవ్ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్.