
అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ..!
తెలుగు చలన చిత్ర ప్రేక్షకులు ఇక్కడి వాళ్ళైనా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇష్టం, అభిమానం లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరేమో!
తెలుగు చలన చిత్ర ప్రేక్షకులు ఇక్కడి వాళ్ళైనా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇష్టం, అభిమానం లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరేమో! ఆవిధంగా అందరిలాగే నేను కూడా అతని అభిమానిని! సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన అతని ప్రతిభా విశేషాల గురించి మరోసారి విస్తారంగా ప్రస్తావించవలసినది లేదు. దాదాపు దశాబ్దిన్నర పైగా, అతన్ని అతి సన్నిహితుడుగా ఎరిగి ఉన్న వాణ్ణి గనక, జన బాహుళ్యానికి అంతగా పరిచయం లేని అతని విశిష్ట వ్యక్తిత్వం గురించి (వ్యక్తిగత విషయాల గురించి కాదు) క్లుప్తంగా చెప్పడం సందర్భానికి సముచితంగా ఉంటుందనుకుటున్నాను.
రచయితగా, దర్శకుడిగా, అతని గురించి విశ్లేషిస్తూ పనిగట్టుకుని ప్రయత్నిస్తే అతనిలో ఒకటో, అరో లోపాలు వెతికి చూడగలవేమో కానీ, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, స్నేహితుడిగా, సామాజికుడిగా... ఇలా జీవితంలో ఎదురైన ప్రతి పాత్రకి పరిపూర్ణ న్యాయం కలిగించడంలో ఇంత చిన్న వయసులో (నా వయసుతో పోలిస్తే) అతను సాధించిన పరిణతి వేలెత్తి వంక చూపవీల్లేనిది. అతనంటే నాకున్న అపారమైన ఇష్టానికి ఇదొక ముఖ్య కారణం!విద్య, వివేకము, వినయం, సమపాళ్ళలో కలగలుపుకున్న అరుదైన వ్యక్తి. గుండెల్లో కొండంత నిబ్బరం, అపారమైన ఆత్మవిశ్వాసం, అణుమాత్రమైనా అహంకారం లేకపోవడం వంటి విలువైన లక్షణాలు జన్మసిద్ధంగా అబ్బిన వ్యక్తి. సునిశితమైన మేధస్సు, సున్నితమైన మనస్సు అతని సహజగుణాలు.
తన అంతర్గత శక్తులు, తన పరిమితులు, తన ప్రయాణ మార్గాలు, మజిలీలు అన్నిటి గురించి ఏమాత్రం తడబాటు లేని స్పష్టమైన అవగాహన అతనికే ప్రత్యేకమైన సుగుణం. ఒక చిట్టాలో పైన వల్లించిన ఉత్తమ లక్షణాలన్నీ అనడానికీ వినడానికీ బాగానే ఉంటాయి గానీ, అవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నూటికో కోటికో ఒకళ్లుంటారు. అలాంటి వాళ్ళలో అతను ఒకడు.ఏ రకంగానూ, చుట్టుపక్కల నుంచి ఎవ్వరూ, ఏ చిన్న చేయూతని కూడా అందించలేని ఒకానొక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి కేవలం తన స్వశక్తితో ఇంత ఎత్తుకి ఎదిగిన త్రివిక్రమ్, ఆ ఎదుగుదల క్రమంలో ఎంతమందికి, ఇంత అని చెప్పలేనంతగా చేయూతనందించాడో, పొందిన వారెవ్వరూ ఎప్పుడూ మరచిపోరు. అలా తానెందరికో ఆసరాగా నిలిచిన సంగతి అతనెన్నడూ గుర్తుపెట్టుకోడు.
ఒక నీడనిచ్చే చెట్టులా, నీటినిచ్చే ఏటిలా, ఊపిరిచ్చే గాలిలా, అలా అలా సింపుల్‌గా, న్యాచురల్‌గా అతను సాటి మనుషుల పట్ల స్పందించే తీరు నాకు అశ్చర్యానందాలు కలగజేస్తుంది.సుగంధం చిందడం పూలకెంత సహజమో, అలా తన ఈ ‘గొప్పతనం’ లేదా ఈ మంచితనం.. వీటిని అతను ప్రదర్శించడు... ప్రవర్తిస్తాడు. అంతే!అతని సహజ లక్షణం అతని చిత్రాల్లో, కథల్లో, కథనంలో, సంభాషణల్లో ప్రతిఫలిస్తుంటుంది. ‘అతి’ గాని, మెలోడ్రమెటైజేషన్ గాని, కాంప్లికేషన్‌గానీ లేకపోవడం అనే అతని శైలిని పరిశీలిస్తే, అవి కావాలని తెచ్చి పెట్టుకున్న ప్రక్రియలు కావనీ, అతని సొంత సంతకం అని తెలుస్తుంది.
అతను తన భావోద్వేగాలను (ఎమోషన్స్), అభిప్రాయాలనూ అదుపులో ఉంచుకునే సంవిధానం అత్యంత అరుదైన లక్షణం. ఇది నేర్పితే వచ్చేది కాదు. ఏ ఫార్మాలిటీస్ లేని వాడిలా కనిపిస్తూ, ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడికి పిలవకుండానే వెళ్ళి అక్కడి (అక్కర) తీర్చి ఏవీ పట్టని వాడిలా ఇట్టే చటుక్కున మాయం అయిపోతాడు. ఎప్పుడో నేను రాసిన ఓ పాటలో ‘‘అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ’’ అన్నట్టుగా అనిపిస్తూ ఉండడం అతని ప్రత్యేకత. అతను మంచి వక్త. అయినా ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ, ఏది బడితే అది మాట్లాడేస్తూ ఉండడు. కనుకనే అతను ఎప్పుడైనా బహిరంగ వేదికల మీదుగా మాట్లాడుతూ ఉంటే ఏటికోసారి వచ్చే పండుగలా ఉంటుంది. అతను ప్రచార ప్రసార మధ్యమాల్లో కూడా తరచుగా కనబడడు. అతని సినిమాలే అతన్ని చూపిస్తాయి.
కాస్త వివరంగానే రాశానేమో... ఇది చదివితే అతను ‘కొంచెం ఎక్కువగా రాశారేమో కదండీ!’ అన్నా అంటాడు. అతని సినిమాలు చూస్తూ వాటి ద్వారా అతన్ని చూడడానికి ప్రయత్నించేవారికి నేను రాసిన ఈ పద్ధతి ‘మరీ ఎక్కువేమో’ అనిపించదని నా నమ్మకం.ఇక మా ఇద్దరికి ఉన్న వ్యక్తిగత, వృత్తిగత సంబంధ బంధవ్యాలకు సంబంధించి ఒకే మాట... ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఇరుకు అనిపించేంత దగ్గరగా ఉండం, అరిచినా వినిపించనంత దూరంగా ఉండం! శ్రీనూ! నీ గురించి నా మనసులో ఉన్న నాలుగు మాటలు నీకు చెప్పనివి నాకు చెప్పాలనిపించినవి చెప్పడానికి అవకాశమిచ్చిన సాక్షి పత్రిక వారికి కృతజ్ఞతలు...
శతాయుష్మాన్‌భవ!!!
త్రివిక్రమ్ పని చేసిన చిత్రాలకు నేను పాటల రచన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన వంతు భాగం కూడా అందులో కలిసేది. పాట గురించి మా మధ్య చర్చ జరిగి, అందులో నుంచి రూపుదిద్దుకొన్న రచనకు ‘నువ్వేకావాలి’ చిత్రంలోని ‘అనగనగా ఆకాశం ఉంది...’ పాట ఓ ఉదాహరణ. అలా అతని భాగస్వామ్యమున్న పాటలు చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే త్రివిక్రమ్‌లో కూడా మంచి పాటల రచయిత ఉన్నాడు. ఒక సినిమా (ఒక రాజు ఒక రాణి)కు పూర్తిగా పాటలన్నీ రాసిన అనుభవమూ అతనికి ఉంది. కానీ, అతని దృష్టి అంతా దర్శకత్వం మీదే!
త్రివిక్రమ్ సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు మా మధ్య చర్చలు రావా, వాదన ఉండదా అంటే... ఎందుకుండవు? ఉంటాయి. కాకపోతే, అది ఆ సన్నివేశానికి తగ్గ సరైన సాహిత్యంతో, భావంతో రచన కోసమే! అది అక్కడకే పరిమితం. అతని సినిమాల్లో కొన్ని మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది, రాశాను. ‘జల్సా’ చిత్రంలో తెలుగు భాషలో భాగమైపోయిన ఇంగ్లీషు పదాలు వాడుతూ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా...’ పాట రాసినా, ‘చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్...’ లాంటి భావగర్భితమైన పాట రాసినా... జనం అంతే ఆనందంగా అర్థం చేసుకున్నారు... ఆస్వాదించారు... ఆనందించారు! ఇటీవల ‘జులాయి’లో కానీ, ‘అత్తారింటికి దారేది’లో కానీ నేను పాటలకు రాయకపోవడానికి కారణం - వాటిలో నేను రాయదగ్గ పాటలున్నాయని దర్శకుడు త్రివిక్రమ్ భావించకపోవడమే! నేను మాత్రమే రాయాల్సిన, రాయగల పాటలు ఉన్నప్పుడు అతను తప్పకుండా నా దగ్గరకు వస్తాడు. నాతోనే రాయించుకుంటాడు.
ఇట్లు
సిరివెన్నెల సీతారామశాస్త్రి