నా ఊపిరి వాళ్లే!
‘‘నేను చేసే ప్రతి సినిమా నాకు ప్రత్యేకమే. ఈ ‘ఊపిరి’ ఇంకా ప్రత్యేకం. ఒక వ్యక్తిగా నాలో చాలా మార్పులు తెచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకో వరం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా వంశీ పైడిపల్లి చెప్పిన విశేషాలు...
హాలీవుడ్ చిత్రం ‘ఇన్‌టచబుల్స్’ చూసి, కదిలిపోయాను. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనిపించింది. పీవీపీగారిని కలిస్తే, చేద్దామన్నారు. వీల్ ఛైర్‌కి పరిమితమయ్యే పాత్రను నాగార్జునగారు చేస్తేనే, ఈ సినిమా చేయాలనుకున్నాను. లేకపోతే మానేయాలనుకున్నాను.
అలాగే, కార్తీ పాత్రకు చిన్న ఎన్టీఆర్‌ను అనుకున్నాను. కానీ, ఇప్పట్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని ఎన్టీఆర్ అనడంతో కార్తీని తీసుకున్నాను. అయితే ఎన్టీఆరే స్వయంగా నాగార్జునగారికి ఫోన్ చేసి, ‘వంశీ ఒక కథ చెబుతాడు. తిట్టొద్దు’ అన్నాడు. నేనెళ్లి కథ చెప్పగానే, ఆయన ఒప్పేసుకున్నారు. వాస్తవానికి సెకండాఫ్‌లో నాగార్జున గారికి తగ్గట్టు కొంత మార్చాను.
కానీ, అలాంటిదేమీ వద్దని ఆయన అన్నారు. ఇప్పటివరకూ వచ్చిన హాలీవుడ్ చిత్రాల్లో ‘టాప్ 25’లో ‘ఇన్‌టచబుల్స్’ ఒకటి. ఆ సినిమాకి రీమేకే ‘ఊపిరి’ అని తెలిసి, ప్యారిస్‌లో లొకేషన్స్ చాలా ఈజీగా ఇచ్చేశారు. ఆ చిత్రానికి ఉన్న గౌరవం అలాంటిది. మంచి ఎమోషనల్ మూవీ. తెలుగుకు అనుగుణంగా కొన్ని మార్పులు, తమిళ వెర్షన్‌కు కొన్ని మార్పులు చేసి ఈ సినిమా తీశాం. మాతృక కన్నా తెలుగు, తమిళ చిత్రాలు బాగుంటాయి.
నా ఊపిరి ఎవరు? అంటే.. నా కూతురు, భార్య, మా అమ్మ... ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వ్యక్తి గతంగా నన్ను టచ్ చేసిన చిత్రం ఇది. థియేటర్ నుంచి బయటి కొచ్చేటప్పుడు ప్రేక్షకులు ఒకింత భావోద్వేగంతో వస్తారు. అఖిల్ హీరోగా ఓ చిత్రం చేయడానికి చర్చ జరుగుతోంది. అంతా ఫైనలైజ్ అయిన తర్వాత నా తదుపరి చిత్రం గురించి చెబుతా.