ఆ రెండు విషయాలతో ఎవరూ పోరాడలేరు!
‘‘నంబర్ గేమ్స్‌ను నమ్మను. మనసుకి నచ్చిన సినిమాలు చేస్తూ వెళ్లిపోతా. పరిస్థితులు ఏవైనా తలకిందులు అయితే తప్ప నాకు జీవితాంతం నటించాలనే ఉంది’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ‘ఊపిరి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో పంచుకున్న విశేషాలు...
♦ ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచ్‌బుల్స్’ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి ‘ఊపిరి’ చేశాం. ఇందులో నేను క్వాడ్రాప్లీజిక్ పేషంట్‌గా వీల్‌చైర్‌కు పరిమితమయ్యే పాత్రలో కనిపిస్తాను. అఖిల్, నాగచైతన్య ఈ కథ విని, చేయొద్దన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల కేన్సర్ పేషంట్ అంటే నేనూ మొదట ఒప్పుకోలేదు. కానీ ‘ఊపిరి’ మనసుకి నచ్చి చేశాను.
♦ వాస్తవానికి నా అభిమానులు నేను చేసే వెరైటీస్‌కి అలవాటు పడిపోయారు. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో నేను చేసిన ప్యూర్ లవ్‌స్టోరి ‘గీతాంజలి’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘అన్నమయ్య’ చేస్తానంటే ‘కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంటే ఇలాంటి సినిమా చేయడం ఏంటి?’’ అన్నవాళ్లూ ఉన్నారు. కానీ ‘అన్నమయ్య’ చూసి, వాళ్లే నా దగ్గరకొచ్చి ఆనందం వ్యక్తం చేశారు.
♦ జనరల్‌గా మనం ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు చేతులు ఆడిస్తాం. కానీ, ఈ పాత్రకు కుదరదు. నా చేతులను, కాళ్లను కట్టిపడేసినట్లుగా చేయాల్సి వచ్చింది. నా కదలికలను చూడటానికే ఇద్దరు అసిస్టెంట్లను పెట్టారు. మామూలుగా ఎవరైనా షాట్ గ్యాప్‌లో హాయిగా కూర్చొని, రిలాక్స్ అవుతారు. నేను మాత్రం కట్ అని చెప్పగానే హాయిగా సెట్ అంతా తిరిగేసేవాణ్ణి.
♦ కార్తీ చేసిన పాత్ర కోసం ఎన్టీఆర్‌ను అనుకున్న మాట నిజమే. అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక ఎన్టీఆర్ తప్పుకోవడంతో, కార్తీని ఎప్రోచ్ అయ్యాం. కార్తీ సలహా ఇవ్వడంవల్లే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాను.
♦ మల్టీస్టారర్ అంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టేసి, మన పాత్రకు పరిమితమైపోవాలి. ఇప్పుడు ‘క్షణం’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వస్తే కచ్చితంగా చేస్తా. అయితే అలాంటి సినిమా 4 నుంచి 5 కోట్ల బడ్జెట్‌లోనే చేయాలి. నాతో చేస్తున్నారు కదా అని రూ. 20 కోట్లు పెడితే ఆ సినిమా గల్లంతే.
♦ సూపర్‌స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా విభిన్న తరహా సినిమాలు చేసేవాళ్లు చాలా కొంతమందే ఉన్నారు. అందులో కమల్‌హాసన్ ఒకరు. ఆయన అన్నీ ట్రై చేశారు. చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్‌ని తీసుకుంటే, ఆయన ఇమేజ్‌కి భిన్నంగా సినిమా చేస్తే, అభిమానులు హర్ట్ అవుతారు. అందుకే ఇమేజ్ చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతెందుకు... ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌లో చాలా మంది ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి, బయటకు రాలేకపోతున్నారు. అవే పంచ్ డైలాగులు, అవే ఫైట్లు... ఈ పరిస్థితి మారాలి. మళ్లీ తెలుగు సినిమాకు కొత్త రోజులు రావాలి. నా మటుకు నేను వెరైటీలు ట్రై చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఇప్పుడూ అంతే.
♦ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశ’ అనే సినిమా చేయనున్నా. ‘సోగ్గాడే...’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది. ‘ఓం నమో వెంకటేశ’ మొదలు కావడానికి ఇంకా టైమ్ పడుతుంది. అలాగే అఖిల్ తదుపరి చిత్రకథపై దృష్టి పెట్టాను. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు నాకు సంతృప్తికరంగా ఉన్నాయి. రిటైర్మెంట్ ఆలోచనే లేదు. అయితే ఎప్పుడూ హీరోగా చేయలేను కదా. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తాను. వయసుతో, సమయంతో ఎవరూ ఎక్కువ కాలం పోరాడలేరు.
♦ గతేడాది ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగు సినిమా కళకళలాడుతోంది. ఇది మంచి పరిణామం. కానీ, నా అభిప్రాయం ఏంటంటే సినిమాల సంఖ్య తగ్గాలి. వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ జనవరి నుంచి మార్చి వరకే దాదాపు 50 వర కూ విడుదలై ఉంటాయి. అయినా ప్రేక్షకులు ఎన్ని సినిమాలని చూస్తారు. క్వాలిటీ ఔట్‌పుట్ మీద దర్శక, నిర్మాతలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని సినిమాలకు నిజమైన విజయం లభించిందనేది నా ప్రశ్న. పెట్టిన ఖర్చు వెనక్కి రావాలి. వస్తేనే కదా మళ్లీ ఇంకో సినిమా తీయొచ్చు.
♦ త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను, అల్లు అర్జున్ హీరోలుగా నటించనున్నామనే వార్త ప్రచారమవుతోంది. ఈ వార్త ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ‘దిల్’ రాజు నిర్మించాలనుకుంటున్న సినిమా కథ కూడా ఇంకా వినలేదు.