‘‘నేను చేసే పాత్ర నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తే చాలు. సినిమా ఒప్పుకుంటాను. పారితోషికం గురించి పెద్దగా ఆలోచించను. పదేళ్ల తర్వాత ఆ నిర్మాత అంత ఇచ్చాడు.. ఈ నిర్మాత ఇంత ఇచ్చాడు అని లెక్కలు వేసుకోను. అలా లెక్కలేసుకుని పదివేలు తక్కువయ్యాయని ‘అష్టా చమ్మా’ సినిమాను వదులుకుని ఉంటే నాకు జీవితమే ఉండేది కాదు. నేను కొన్ని సినిమాలు ఉచితంగా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా చేశాను. అలాగని అన్నీ ఫ్రీగా చేయలేం.
నాకూ ఖర్చులు ఉంటాయి’’ అన్నారు దర్శక,నటుడు, రచయిత శ్రీనివాస్ అవసరాల. నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. బాలాజీ సానల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్‌ఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఊరిని, కుటుంబాలను, సంప్రదాయ విలువలను గౌరవించాలనుకునే ప్రేమికుల కథ ఇది.
నాది తమిళ వ్యక్తి పాత్ర. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ ఊరికి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరం. శ్రీనివాస్ అవసరాల ఉంటే వినోదం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం కొంతవరకు నిజమని నమ్ముతాను. కానీ నేను కూడా చెత్త సినిమాలు చేశాను. ఆడుతూపాడుతూ చేసిన ‘అష్టాచమ్మా’ పెద్ద విజయం సాధించింది. సూపర్ హిట్ సాధిస్తాయనుకున్న నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు.
యాక్టర్స్ అందరూ స్క్రీన్ రైటింగ్ చదువుకోవాలన్నది నా నమ్మకం. అప్పుడే కథలు వినేప్పుడు ఏయే అంశాలకు కథలు ఒప్పుకుంటున్నామో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడిగా నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా చేస్తున్నాను. నటుడిగా ‘నాయనా రారా ఇంటికి’ (ఎన్‌ఆర్‌ఐ) సినిమా చేస్తున్నాను. ఈ సినిమా సగం పూర్తయింది. అలాగే ఓ కథ రాస్తున్నా. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment