అండ్‌ ది ఆస్కార్‌ గోస్‌ టూ... | Oscar 2018 - Best Picture | Sakshi
Sakshi News home page

అండ్‌ ది ఆస్కార్‌ గోస్‌ టూ...

Published Wed, Feb 28 2018 1:11 AM | Last Updated on Wed, Feb 28 2018 1:21 AM

Oscar 2018 - Best Picture - Sakshi

ఆస్కార్‌ అవార్డు

ఆస్కార్‌ అవార్డుల వేడుక జరిగే సాయంత్రం. అప్పటికి బెస్ట్‌ డైరెక్టర్, బెస్ట్‌ యాక్టర్, బెస్ట్‌ యాక్ట్రెస్‌.. లాంటి టాప్‌ క్యాటగిరీల అవార్డులు ఇచ్చేశాక అందరూ ఆసక్తిగా, టెన్షన్‌తో ఎదురుచూసే ఒక్క ఆస్కార్‌ మిగిలి ఉంటుంది. అదే బెస్ట్‌ పిక్చర్‌. ఒక సినిమాను, మొత్తంగా బెస్ట్‌ అనాలంటే ఆ సినిమాకు ఎన్ని అర్హతలు ఉండాలి? డైరెక్షన్, యాక్టింగ్, స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో ఆ సినిమా ది బెస్ట్‌ అనిపించుకునే ఔట్‌పుట్‌ ఇవ్వాలి. అన్నింటికీ మించి, ఈ విభాగాలన్నింటినీ డామినేట్‌ చేస్తూ, కేవలం కథగా ఒక బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలి. అలాంటి సినిమాలు సంవత్సరానికి ఎన్ని వస్తాయి? అందులోంచి నామినేషన్స్‌ ఎంపిక చేయడమే కష్టం. ఇక ఆ నామినేషన్స్‌ నుంచి ఒక్క సినిమా ఎంపిక చెయ్యడం అంటే? ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ‘బెస్ట్‌ పిక్చర్‌’ కోసం తొమ్మిది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆ తొమ్మిది సినిమాలూ దేనికదే ప్రత్యేకం. వీటిలో ఆస్కార్‌ అందుకొని, అవార్డు వేడుకను గ్రాండ్‌గా ముగించే సినిమా ఏది?

1 డార్కెస్ట్‌ అవర్‌ (దర్శకుడు: జోయ్‌ రైట్‌) 
1940ల్లో జరుగుతుంది ఈ కథ. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. అన్ని దేశాలూ తమకు సంబంధం లేని విషయం అనుకున్నా కూడా ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి. గ్రేట్‌ బ్రిటన్‌కు ప్రధానిగా ఎన్నికయ్యాడు విన్‌స్టన్‌ చర్చిల్‌. ఇలాంటి సమయంలో అతనికి ఎదురైన సవాళ్లేంటీ? జర్మనీని ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధం వైపుకు వెళ్లాలా? ఓ పక్క తమ సైనికులు చావు బతుకుల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి స్థితిలో చర్చిల్‌ తీసుకున్న నిర్ణయాలు ఏంటన్నది ప్రస్తావిస్తూ ‘డార్కెస్ట్‌ అవర్‌’  సినిమా నడుస్తుంది. జోయ్‌ రైట్‌ దర్శకుడు. చర్చిల్‌ పాత్రలో గ్యారీ ఓల్డ్‌మన్‌ నటించాడు. హిస్టరీని తెలివిగా, బెస్ట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తూ చెప్పిన సినిమాగా డార్కెస్ట్‌ అవర్‌ సూపర్‌ రివ్యూలు తెచ్చుకుంది. అవార్డు అందుకునేందుకు మిగతా సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేలానే ఈ సినిమా కనిపిస్తోంది.  


2 డంకర్క్‌ (దర్శకుడు: క్రిస్టొఫర్‌ నోలన్‌) 
‘డార్కెస్ట్‌ అవర్‌’లానే ‘డంకర్క్‌’ కూడా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలోనే, సరిగ్గా 1940 కాలంలోనే జరుగుతుంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ లాంటి దేశాలన్నీ జర్మనీ కూటమితో పోరాడుతున్నాయి. జర్మనీదే పైచేయి. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ సైనికులు అన్నివిధాలా చావుకు దగ్గరవుతున్నారు. ఫ్రాన్స్‌లోని డంకర్క్‌ తీర ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షల మంది దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నారు. అందరూ పోరాడాలనుకుంటున్న సైనికులే! కానీ జర్మనీ దాడుల ముందు నిలబడలేరు. వాళ్లు బతకాలి. అందుకు ప్రభుత్వం ఎవాక్యుయేషన్‌ చేపట్టింది. డంకర్క్‌ నుంచి సైనికులను సేఫ్‌ ప్లేస్‌కు ఎవాక్యుయేట్‌ చేయడం ఎలా జరిగిందో ‘డంకర్క్‌’ సినిమా చెప్తుంది. ఇందులో వార్‌ ఉంటుంది. కానీ అది వార్‌లా ఉండదు. టైమ్‌ను వాడుకుంటూ నోలన్‌ చేసిన ప్రయత్నం అద్భుతం అనిపించుకుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో లెక్కలేనంత మంది అభిమానులను, ఎవరికీ సాధ్యం కాని స్థాయిలో బాక్సాఫీస్‌ సక్సెస్‌నూ అందుకున్న నోలన్‌ ‘డంకర్క్‌’తో బెస్ట్‌ డైరెక్టర్‌ నామినేషన్‌ కూడా దక్కించుకున్నాడు. 


3 ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌  (దర్శకుడు: గెలెర్మో దెల్‌తోరో) 
‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ ఫ్యాంటసీ తరహా కథ. ఎలీసా ఈ కథలో ప్రధాన పాత్ర. ఎలిసాకు మాటలు రావు. ఏది చెప్పాలన్నా సైగల ద్వారానే చెప్తుంది. హై సెక్యూరిటీ ఉండే ఒక గవర్నమెంట్‌ ల్యాబరోటరీలో ఆమె క్లీనింగ్‌ లేడీగా పనిచేస్తుంది. అదొక సీక్రెట్‌ ల్యాబ్‌. అందులో కొన్ని వింత ప్రయోగాలు జరుగుతాయి. అక్కడే ఎలీసా ఒక వింత జీవిని చూస్తుంది. వాటర్‌ ట్యాంక్‌లో ఉంటుంది ఆ జీవి. ఆ జీవితో సైగలతో మాట్లాడుతుంది ఎలీసా. ఆ వింత జీవికి దగ్గరైపోతుంది ఎలిసా. ఇద్దరి మధ్యా లవ్‌. ఆ తర్వాత ఏం జరుగుతుందీ? అన్నది సినిమా. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గెలెర్మో బెస్ట్‌ డైరెక్టర్‌ నామినేషన్‌ కూడా దక్కించుకున్నాడు. ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు దగ్గరగా ఉన్న సినిమాగా ‘షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ పేరు వినిపిస్తోంది. 

4 త్రీ బిల్‌బోర్డ్స్‌  ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి  (దర్శకుడు: మార్టిన్‌ మెక్‌డొనా)
మిల్డ్రెడ్‌ హెయిజ్‌కి కోపమొచ్చింది. కూతురు చనిపోయి నెలలు గడుస్తున్నాయి. ఆమెను చంపినవారిని ఇప్పటికీ పట్టుకోలేదు పోలీసులు. పోరాడి పోరాడి అలిసిపోయింది. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. సరిగ్గా టౌన్‌ స్టార్టింగ్‌ పాయింట్‌ దగ్గర మూడు బిల్‌బోర్డ్స్‌ పెట్టిందామె. ఆ బిల్‌బోర్డ్స్‌లో కూతురు మర్డర్‌ కేసును ఛేదించని పోలీసుల గురించి రాసింది. దాని గురించి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఆమెకు బెదిరింపులు పెరిగాయి. పత్రికల వాళ్లొచ్చారు. టీవీ వాళ్లు వచ్చారు. ఆ తర్వాత ఆమె ఎవరి పేర్లైతే ప్రస్తావించిందో వాళ్లతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అన్నదే కథ. చివరకు కూతురు మర్డర్‌ మిస్టరీ ఛేదించిందా లేదా కూడా ప్యారలల్‌గా ఇంకో కథ. గోల్డెన్‌ గ్లోబ్‌లో బెస్ట్‌ పిక్చర్‌ అవార్డు దక్కించుకున్న ఈ సినిమా, ఆస్కార్‌లోనూ గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది. 

5 కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌  (దర్శకుడు:  లూకా గడనీనో) 
‘కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌’.. అదే పేరుతో ఉన్న నవల నుంచి పుట్టిన సినిమా. 1983 నేపథ్యంలో కథ నడుస్తుంది. 17 ఏళ్ల హీరో ఎలియో, తన తండ్రి వద్ద ఇంటర్న్‌గా పనిచేయడానికి వచ్చిన అబ్బాయి ఒలివర్‌ని ఇష్టపడతాడు. ఒకరికొకరు తక్కువ రోజుల్లోనే దగ్గరైపోతారు. మరోపక్క ఎలియోకు ఒక గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఎలియో, ఒలివర్‌ల షాకింగ్‌ రిలేషన్‌షిప్‌ ఎక్కడికి వెళుతుంది, అది వాళ్ల జీవితాలను ఎలా మారుస్తుంది అన్నదే సినిమా. షాకింగ్‌ ఎలిమెంట్‌తో కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని రీతిలో అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. కథలోని కోర్‌ ఎమోషన్‌ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది. ఆస్కార్‌ బెస్ట్‌ పిక్చర్‌ రేసులో ఈ సినిమా కూడా గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది. 

6 గెట్‌ ఔట్‌  (దర్శకుడు: జోర్డాన్‌ పీలె) 
హీరో క్రిస్‌ వాషింగ్టన్‌కు ఒక గర్ల్‌ఫ్రెండ్‌ ఉంటుంది. అతను నల్లజాతి వాడు. ఆ అమ్మాయి తెల్లజాతికి చెందినది. ‘ఈ వీకెండ్‌ మా ఇంటికి వచ్చి నా పేరెంట్స్‌తో మాట్లాడాలి నువ్వు..’ అని చెప్పి హీరోను హీరోయిన్‌ తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడికెళ్లాక హీరోకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. విచిత్రమైన మనుషులు కనిపిస్తుంటారు. కథ ఊహించని మలుపులు తిరుగుతూ థ్రిల్లింగ్‌గా సాగిపోతుంది. చివరకు ఈ కథ ఎక్కడికి వెళుతుందన్నదే సినిమా. ‘గెట్‌ ఔట్‌’ తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సినిమా. విమర్శకులు కూడా ఈ సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సాధారణంగా హర్రర్‌ సినిమాలు ఆస్కార్‌ బెస్ట్‌ పిక్చర్‌ వరకూ వెళ్లడం అరుదు. ‘గెట్‌ ఔట్‌’ నామినేషన్‌ వరకూ వచ్చింది. దర్శకుడు జోర్డాన్‌ కూడా ఈ సినిమాకు బెస్ట్‌ డైరెక్టర్‌ నామినేషన్‌ దక్కించుకున్నాడు. హీరో డేనియల్‌ కలూయా బెస్ట్‌ యాక్టర్‌ నామినేషన్‌ దక్కించుకున్నాడు. 


7 లేడీ బర్డ్‌  (దర్శకురాలు:  గ్రెటా గెర్వెగ్‌) 
లేడీ బర్డ్‌ ఒక టీనేజ్‌ అమ్మాయి. హైస్కూల్లో సీనియర్‌ స్టూడెంట్‌. లేడీ బర్డ్‌ తల్లికి ఆమె ఎలా కోరుకుంటే అమ్మాయి అలా ఉండాలని ఉంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి ఇష్టం. అయినా ఏదో తెలియని దూరం ఇద్దరి మధ్యా. లేడీ బర్డ్‌ ఒకబ్బాయిని ప్రేమిస్తుంది. విడిపోతుంది. ఇంకో అబ్బాయితో మళ్లీ ప్రేమలో పడుతుంది. ఈ పరిస్థితుల్లో లేడీ బర్డ్‌కు, ఆమె తల్లికి మధ్యన జరిగే ఎమోషనల్‌ జర్నీ ప్రధాన కథగా సినిమా నడుస్తుంది. గ్రెటా గెర్వెగ్‌ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించింది. ఆస్కార్‌లో బెస్ట్‌ డైరెక్టర్స్‌గా నామినేషన్‌ దక్కించుకున్న వాళ్లలో ఐదో వ్యక్తి గ్రెటా. సోయర్స్‌ రోనన్‌ నటన అద్భుతంగా ఉంటుందీ సినిమాలో. ఆమె బెస్ట్‌ యాక్ట్రెస్‌గా నామినేషన్‌ కూడా దక్కించుకుంది. 

8 ఫాంటమ్‌ థ్రెడ్‌  (దర్శకుడు: పాల్‌ థామస్‌ ఆండర్సన్‌) 
1950లో లండన్‌ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరో ఒక డ్రెస్‌మేకర్‌. పెద్ద పెద్ద పర్సనాలిటీలకు, సినిమా స్టార్స్‌కు డ్రెసెస్‌ డిజైన్‌ చేస్తుంటాడు. అతడి జీవితంలోకి అమ్మాయిలు వస్తుంటారు. పోతూంటారు. ఒకమ్మాయి మాత్రం అతనికి తెలీకుండానే బాగా దగ్గరైపోతుంది. ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి వచ్చాక తను కెరీర్‌ మీద దృష్టిపెట్టలేకపోతున్నానని భావిస్తాడు. ఆ తర్వాత వారిద్దరి కథ ఏయే మలుపులు తిరుగుతుందన్నదే సినిమా. పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ మేకింగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆయన ఈ సినిమాకు బెస్ట్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయ్యాడు కూడా. డేనియల్‌ డే లూయీజ్‌ నటనను కూడా అందరూ మెచ్చుకున్నారు. ఆయన కూడా ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాడు.

9 ది పోస్ట్‌  (దర్శకుడు:  స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌) 
మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రపంచానికి తెలియని ఒక సీక్రెట్‌ను బయటపెట్టాలి. నలుగురు ప్రెసిడెంట్స్‌ మారిపోయారు ఈ కాలంలో. కేథరిన్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఫస్ట్‌ ఫీమేల్‌ పబ్లిషర్‌. ఎడిటర్‌ బ్రాడ్లీతో కలిసి ఆమె ఈ సీక్రెట్‌ను బయటపెట్టాలనుకుంటుంది. వాళ్ల కెరీర్‌కే పెద్ద ముప్పు తెచ్చిపెట్టే వ్యవహారం అది. అయినా పోరాడతారు. ఒక నిజ జీవిత కథను సినిమాగా మార్చి తెరకెక్కించడంలో స్పీల్‌బర్గ్‌ చూపిన ప్రతిభకు ముగ్ధులైపోయారంతా. స్పీల్‌బర్గ్‌ను అందరూ గొప్ప దర్శకుడని ఎందుకంటారో ఈ సినిమా మరోసారి ఋజువు చేస్తుంది. అయితే ఈ సినిమాకు స్పీల్‌బర్గ్‌ నామినేషన్‌ దక్కించులేకపోవడం గమనార్హం. టామ్‌ హ్యాంక్స్, మెరిల్‌ స్ట్రీప్‌ లాంటి టాప్‌ యాక్టర్స్‌ నటించిన సినిమా, విమర్శకుల ప్రశంసలను అందుకొని, ఆస్కార్‌ రేసులో అన్ని సినిమాలకూ గట్టి పోటీ ఇస్తూ నిలబడింది. 
పైన చెప్పుకున్న తొమ్మిది సినిమాల్లో.. తొమ్మిదీ డిఫరెంట్‌ జానర్‌ సినిమాలే! అన్నీ బెస్ట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చినవే! ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’, ‘ది పోస్ట్‌’ సినిమాలు ఇందులో ఆస్కార్‌కు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నా, ఆ వేడుక జరిగేరోజు వచ్చేసరికి ఏ సినిమా అవార్డు గెలుచుకుంటుందనేది వేచి చూడాల్సిందే! అంటే మార్చి 4 వరకూ ఈ వెయిటింగ్‌ తప్పదనే!! 

‘బెస్ట్‌ పిక్చర్‌’  ఓటింగ్‌ లెక్కలు వేరు!
ఆస్కార్‌ విజేతలను ఎంపిక చేసేందుకు కొంతమంది మెంబర్స్‌ ఓటింగ్‌ను లెక్కలోకి తీసుకుంటారు. ఈ ఏడాది 6,028 మంది మెంబర్లు వేసే ఓట్లతో విజేతలను ఎంపిక చేస్తున్నారు. ఇక మొత్తం 24 క్యాటగిరీల్లో 23 క్యాటగిరీల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్లకు అవార్డును ఇచ్చేస్తారు. ఒక్క ‘బెస్ట్‌ పిక్చర్‌’కు మాత్రం ఓటింగ్‌ పద్ధతి వేరేలా ఉంటుంది. ప్రిఫరెన్షియల్‌ బ్యాలెట్‌ పద్ధతిలో బెస్ట్‌ పిక్చర్‌ను ఎంపిక చేస్తారు. ఈ పద్ధతిలో మెంబర్స్‌ను మీకిష్టమైన సినిమా ఏది అని అడగకుండా, మీకు నచ్చిన ఆర్డర్‌ ఇవ్వండి అని అన్ని సినిమాలకు ర్యాంక్‌ ఇవ్వమంటారు. అలా నామినేట్‌ అయిన అన్ని సినిమాలకు, అందరూ ర్యాంకులు ఇస్తారు. అందులో 50 శాతానికి మించి మెంబర్లు ర్యాంక్‌ 1 ఏ సినిమాకు ఇస్తారో అదే బెస్ట్‌ పిక్చర్‌ అవుతుంది. ఒకవేళ ఏ సినిమాకూ 50 శాతం మంది ర్యాంక్‌ 1 ఇవ్వకపోతే, తక్కువమంది ర్యాంక్‌ 1 ఇచ్చిన సినిమాను ఎలిమినేట్‌ చేసి, మిగిలిన సినిమాలకు మళ్లీ ఇదే ప్రాసెస్‌ రిపీట్‌ చేస్తారు. ఏదో ఒక సినిమా 50 శాతానికి మించి ర్యాంక్‌ 1 తెచ్చుకునే వరకూ ఈ ప్రాసెస్‌ కొనసాగుతుంది. అప్పుడు బెస్ట్‌ పిక్చర్‌ అవార్డు అందుకుంటుంది. ఆస్కార్‌ ఫంక్షన్‌లో చివర అవార్డుకు ఉన్న క్రేజ్‌ వెనక ఇంత కథ ఉంది మరి!!

బెస్ట్‌ డైరెక్టర్‌ –  బెస్ట్‌ పిక్చర్‌ లింక్‌
సాధారణంగా బెస్ట్‌ డైరెక్టర్‌ నామినేషన్స్‌ దక్కించుకున్న వారి సినిమాలన్నీ బెస్ట్‌ పిక్చర్‌కు కూడా నామినేట్‌ అయి ఉంటాయి. ఈ ఏడాది బెస్ట్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయిన ఐదుగురి సినిమాలూ బెస్ట్‌ పిక్చర్‌గానూ నామినేట్‌ అయ్యాయి. ఈ లింక్‌ ఎప్పుడో ఒక్కసారి కానీ తప్పదు.  బెస్ట్‌ పిక్చర్‌ అవార్డును ఆ సినిమాను నిర్మించిన వ్యక్తికి అందిస్తారు. నిర్మాతలు ఇద్దరు, ముగ్గురు ఉంటే ఆ ముగ్గురికీ ఇస్తారు. అయితే ఆ సంఖ్య పెరిగితే మాత్రం, ప్రొడక్షన్‌తో బాగా సంబంధమున్న ఫస్ట్‌ ముగ్గురికే ఆస్కార్‌ ఇస్తారు.  బెస్ట్‌ పిక్చర్‌ క్యాటగిరీలో గతంలో ఐదే నామినేషన్స్‌ ఉండేవి. ఇప్పుడు ఆ లిస్ట్‌ను 5 నుంచి 10 కి తీసుకెళ్లారు. ఐదు లేదా ఐదుకు మించి, పదికి తగ్గకుండా ఆస్కార్‌ నామినేషన్స్‌ ఉంటాయి. ఈ ఏడాది తొమ్మిదికి సరిపెట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement