ఆ రోజు అందరికీ మంచి పార్టీ ఇస్తాను!
‘జీవితంలో ఇదే ఆఖరి రోజు’ అని ముందుగానే తెలుసుకుంటే.. చేయాల్సిన పనులన్నీ ఆ ఒక్క రోజులో చేయాలని తాపత్రయపడిపోతాం. ఇటీవల ఓ సందర్భంలో శ్రుతీహాసన్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే.. ‘ఇదే చివరి రోజు అయితేనా...’ అని కాసేపు ఆలోచించారు. ఈ భూమ్మీద నాకిదే చివరి రోజు అని తెలిస్తే? నేనేం చేస్తానంటే? అని శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘షూటింగ్స్ కోసం త్వరగా నిద్ర లేవడం, హడావిడిగా రెడీ అవ్వడంతో బిజీ బిజీగా ఉంటాను.
అందుకే, చివరి రోజని తెలిసిన రోజున చాలా ఆలస్యంగా నిద్ర లేస్తాను. ఆ తర్వాత నింపాదిగా రెడీ అయ్యి, ఒక జెట్ ఫ్లైట్ తీసుకుంటాను. నాకు నచ్చిన ప్లేస్‌కి వెళ్లి ఒక సంగీత కచేరీ చేస్తాను. దానికి నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యేలా చూసుకుంటాను. అందరికీ మంచి పార్టీ ఇస్తాను. ఆత్మీయులను అభిమానంగా హత్తుకుంటాను. ఏడుస్తాను.. నవ్వుతాను. నా బ్లడ్‌లోనే సినిమా ఉంది కాబట్టి, ఏదైనా సినిమా తప్పనిసరిగా చూస్తాను. ఇంకా టైముంటే ఏది నచ్చితే అది చేస్తాను’’ అని పేర్కొన్నారు.