ఉందిలే మంచి కాలం
‘ఉందిలే మంచికాలం ముందు ముందునా... నాకు మంచి రోజులొస్తాయి నంద నందనా..!’ అంటూ ఆశల పల్లకిలో పాటలు పాడుకుంటోంది నటి పార్వతి ఓమన కుట్టాన్. ఈ మాజీ మిస్ ఇండియాకు మోడలింగ్ రంగంలో కలిసొచ్చినట్లు ఇంకా సినిమా రంగం అచ్చి రాలేదు. తమిళంలో అజిత్ సరసన భిల్లా -2తో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత చిత్రం నంబియార్ కూడా ఈ సుందరికి హిట్ నివ్వలేదు. ఇక్కడ కాకపోయినా బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని పిజ్జా - 3డి చిత్రంలో ఒక రాయి వేసింది. అది గురి తప్పింది. దీంతో నిరుత్సాహపడినా ఇంకా బింకపు మాటలు పలుకుతోంది. ఈ మాజీ సుందరి మాట్లాడుతూ తనకు మంచి రోజులొస్తాయంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నటిగా తన కింతవరకు విజయవంతమైన చిత్రాలు అమరలేదంది. ఇటీవల హిందీలో నటించిన పిజ్జా -3డి చిత్రానికి మిశ్రమ విమర్శలు వచ్చాయని చెప్పింది.
తాను చాలా ఎత్తుపల్లాలు చూశానని తప్పుడు విమర్శలతో వేదనకు గురయ్యానని చెప్పింది. అయినా తనను ప్రత్యక్షంగా కలిసినవాళ్లు తన నటన గురించి మంచిగానే చెబుతున్నారని అంది. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. తానీ స్థాయికి ఎదగడానికి కారణమైన మోడలింగ్ రంగాన్ని వదులుకునే సమస్యే లేదని చెప్పింది. మోడలింగ్‌లో తాను చాలా ప్రదేశాలు చుట్టొచ్చానని తెలిపింది. అదే విధంగా నటనా వృత్తిపైనా తనకు చాలా నమ్మకం ఉందనే అభిప్రాయపడింది. ఈ రంగంలో రాణించడానికి ఇంకొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందని అంది. ఖచ్చితంగా తనకంటూ ఒక టైమ్ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తన ప్రతిభకు సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పార్వతి ఓమన కుట్టాన్ తెలిపింది.