నన్నూ పడక గదికి రమ్మన్నారు
- నటి, 'మరియాన్' ఫేమ్ పార్వతి సంచలన వ్యాఖ్యలు
గాయని సుచిత్ర రేపిన కలకలం ఇంకా సద్దుమణగలేదు. దానికి శాఖలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుసగా ప్రముఖ నటుల రాసలీల దృశ్యాలను తన ట్విట్టర్‌లో వెల్లడించి సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన సుచిత్ర ఇతర నటీమణుల్లో తెగింపును తెచ్చిపెట్టింది. ఇప్పటికే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, సంధ్య, కస్తూరి లాంటి కొందరు హీరోయిన్లు తమ చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడిం చారు.
తాజాగా నటి పార్వతి గొంతు విప్పారు. పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఈ మలయాళీ భామ. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్ డేస్ చిత్రాల్లో నటించారు. ఇక్కడ తను చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారనే చెప్పాలి.
మలయాళంలోనూ నటిస్తున్న పార్వతి ఇటీవల ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హీరోయిన్లతో చిత్ర పరిశ్రమలో ఎలా ప్రవర్తిస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు. పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు తనను పలుమార్లు పడక గదికి రమ్మన్నారని, మరి కొందరు సినిమాల్లో ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని అన్నారు.
అయితే అలాంటి అవకాశాలు తనకు వద్దని ఖరాఖండిగా చెప్పానని తెలిపారు. తాను తక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం అని నటి పార్వతి పేర్కొన్నారు. అలా అవకాశాలు లేకుండా తాను చాలా కాలం ఖాళీగానే ఇంట్లో కూర్చున్నానని చెప్పారు.