Parvathy
-
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్!
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్‌లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్‌ను విభిన్నమైన క్యారెక్టర్లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Happy birthday # Gangamma, @parvatweets stay happy n blessed 💥💥💥#HBDParvathyThiruvothu#Thangalaan pic.twitter.com/nNWvFpihfv — pa.ranjith (@beemji) April 7, 2024 -
దూత నటి హోంటూర్.. వాటికి తనే తల్లినంటూ..
పార్వతి తిరువోతు.. మలయాళీ ముద్దుగుమ్మ. ఔట్ ఆఫ్ సిలబస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కేవలం మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. బెంగళూరు డేస్, చార్లీ, ఎన్ను నింటె మొయిదీన్, టేకాఫ్ వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇంట్లోనే మామిడి, నిమ్మ.. గతేడాది రిలీజైన దూత అనే వెబ్ సిరీస్‌తో తెలుగువారికి పరిచయమైంది. తాజాగా ఆమె తన హోంటూర్ చేసింది. 'నా ఇంట్లో మామిడి చెట్టు ఉంది. నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. ఆ చెట్ల నుంచి ఫలాలు తెంపుకుని వాటినే సలాడ్‌లో వాడుతూ ఉంటాను. ఇది చూసి జనాలు షాక్ అవుతూ ఉంటారు. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ ఇల్లు నన్ను హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది. పడేయడం నచ్చదు నాకంటూ ఓ లైబ్రరీ కూడా ఉంది. నటిగా నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు కాబట్టి ఇంట్లో అన్ని వస్తువులు తెచ్చి నింపేసుకోను. వస్తువులు పాతగైపోగానే పడేయడం ఇష్టముండదు. 19 ఏళ్లుగా ఓ చిన్న మొక్క కూడా నాతోనే ఉంది. దాదాపు 36 మొక్కలకు నేను తల్లినైపోయాను. ఈ బాల్కనీలో ఉండటం ఎంతో ఇష్టం' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్ తన బాల్కనీని పచ్చదనంతో నింపేసింది, పెద్దగా సామాన్లు లేకుండా చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ArchPro (@arch.kerala) చదవండి: 'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ -
సూపర్‌స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది: స్టార్ హీరోయిన్
కోలీవుడ్‌లో 'సూపర్‌స్టార్' అనే హోదాపై ఇటీవల పెద్ద రచ్చే జరిగింది. దాదాపు 40 ఏళ్లుగా సూపర్‌స్టార్ అనే పట్టం రజనీకాంత్‌ని అంటిపెట్టుకుని వస్తోంది. అలాంటిది ఇటీవల కాలంలో స్టార్ హీరో విజయ్‌కు ఆ ట్యాగ్‌లైన్ కరెక్ట్ అనే ప్రచారాన్ని ఒక వర్గం తెరపైకి తెచ్చింది. ఒక రకంగా రజనీకాంత్ పని అయిపోయింది. ఇప్పుడు అసలైన సూపర్‌స్టార్ విజయ్ అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఇటీవల అక్కడి టీవీ ఛానళ్లలో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ సూపర్‌స్టార్ అనేది ఒక తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ నటులకు అభిమానులు కట్టిన పట్టం. అలాంటి సూపర్‌స్టార్ పట్టం గురించి దూత వెబ్ సీరిస్‌లో మెప్పించిన నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళంలో 'పూ' చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమై.. ఆ తరువాత ధనుష్ సరసన మరియాన్, కమలహాసన్‌తో ఉత్తమ విలన్, అదేవిధంగా శరత్‌కుమార్ నటించిన చైన్నెయిల్ ఆరు నాళ్, రానా, బాబి సింహా తదితరులు నటించిన బెంగళూరు నాట్కల్, శివరంజ, నియుమ్ ఇన్ముమ్ సిల పెంగుళుమ్ వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించారు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తంగలాన్' చిత్రంలో విక్రమ్‌తో కలిసి నటించారు. వీటితో పాటు నాగ చైతన్యతో 'దూత' అనే వెబ్‌సిరీస్‌లో క్రాంతి షెనాయ్గా ఆమె మెప్పించారు. ఇలా సెలెక్టడ్ చిత్రాల్లోనే నటిస్తున్న పార్వతి మలయాళంలోనే సుమారు 30కి పైగా సినిమాల్లో నటించి బిజీగా ఉన్నారు. ఈమె ఇటీవల ఒక భేటీలో సూపర్‌స్టార్ పట్టం గురించి మాట్లాడుతూ సూపర్‌స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది అని ప్రశ్నించారు. అది జస్ట్ సమయానుకూలంగా చెప్పుకునేది మాత్రమేనని, దాని వల్ల ఎవరికీ ప్రయోజనం అని ప్రశ్నించారు. అసలు సూపర్‌స్టార్ అంటే ఏమిటో తనకు అర్థం కాలేదని, దాని వల్ల ఇమేజ్ వస్తుందా అన్నది కూడా తెలియటం లేదన్నారు. తనను సూపర్‌స్టార్ అనడం కంటే సూపర్ యాక్టర్ అని పిలవడమే సంతోషం అని పేర్కొన్నారు. తనకు తెలిసి మలయాళంలో ఫాహత్ ఫాజిల్, ఆసిఫ్ అలీ, నటి రామీ కళింగల్ సూపర్ యాక్టర్స్ అని నటి పార్వతి పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) -
అల వైకుంఠపురములో నటుడి ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్!
మాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, పార్వతిల కూతురు మాళవిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ప్రియుడైన నవనీత్ గిరీష్‌తో మాళవిక ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాగా.. ఇటీవలే మాళవిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్ గురించి అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని అభిమానలకు పరిచయం చేసింది. కాగా.. ఆమె తల్లిదండ్రలైన జయరాం, పార్వతి ఇద్దరు నటీనటులే. ఆమె తండ్రి జయరాం టాలీవుడ్ మూవీలోనూ నటించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో జయరాం కీలక పాత్ర పోషించారు. మలయాళంలో స్టార్ అయిన జయరాం ఈ ఏడాది శివరాజ్‌కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రంలో నటించారు. అంతే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1లోనూ కనిపించారు. అయితే నెల రోజుల క్రితమే జయరాం కుమారుడు కాళిదాస్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాళిదాస్ మోడల్, తన ప్రియురాలైన తరిణిని పెళ్లాడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడో రన్నరప్‌గా తరిణి నిలిచింది. అయితే కుమారుడు కాళిదాస్ పెళ్లి కంటే ముందే మాళవిక పెళ్లి జరుగుతుందని పార్వతి వెల్లడించింది. View this post on Instagram A post shared by Chakki (@malavika.jayaram) View this post on Instagram A post shared by Kochi Raaj (@kochiraaj) -
తంగలాన్ నాకో కొత్త అనుభవం
‘‘నేను విదేశాలు వెళ్లినప్పుడు మీరు బాలీవుడ్డా అని అడుగుతుంటారు. నేను కోలీవుడ్, టాలీవుడ్ అని చెబుతుంటాను. అంటే... వారు ఎక్కువగా హిందీ చిత్రాలే చూసేవారు. కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’..లాంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. దక్షిణాది సినిమాలు ఇప్పుడు ఓ మార్క్‌ని క్రియేట్ చేస్తున్నాయి. రాజమౌళిగారు ఆస్కార్‌ను మనకు తీసుకొచ్చారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు విక్రమ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పా. రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ ఎమోషనల్ అండ్ రా ఫిల్మ్. రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్.. ఇలాంటి తరహా సినీ గ్లామర్ ‘తంగలాన్’లో లేదు. నా పాత్రకు డైలాగ్స్ అంతగా ఉండవు. లైవ్ సౌండింగ్లో సినిమా చేశాం. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. మేకప్‌కు మూడు గంటలు పట్టేది. మీనింగ్‌ఫుల్ సినిమాలు చేస్తుంటారు పా. రంజిత్‌గారు. ‘తంగలాన్’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇక నేను చేసిన ‘9 నెలలు’ చిత్రానికి సురేందర్‌రెడ్డి, వినయ్‌లు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఈవెంట్‌కు వచ్చారు. లైఫ్ సర్కిల్లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విక్రమ్‌గారితో నేను చేసిన తొలి చిత్రమిది. ఆయన అంకితభావం, టైమింగ్ సూపర్. ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులను మెప్పి స్తుంది’’ అన్నారు పా. రంజిత్. ‘‘విక్రమ్ ట్రెమండస్ యాక్టర్. వరల్డ్ సినిమా లవర్స్‌కు ‘తంగలాన్’ ఓ గ్రేట్ ట్రీట్‌లా ఉంటుంది’’ అన్నారు కేఈ జ్ఞానవేల్ రాజా. ‘‘విక్రమ్ సార్ ఓ నటుడుగా తనను తానే మళ్లీ ఆవిష్కరించుకుంటుంటారు’’ అని అతిథిగా పాల్గొన్న సత్యదేవ్ అన్నారు. దర్శకులు వేణు ఊడుగుల, కరుణకుమార్, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు. -
వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి?
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తు తీవ్ర భంగపాటుకు గురి కాబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు ఓఎన్వీ జాతీయ సాహితీ అవార్డును అందజేయనున్నట్టు ఆ అకాడమీ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు తమిళంలో పూ, మరియాన్ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ నటి పార్వతి ఓఎన్వీ గురుప్ అవార్డులు వైరముత్తుకు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. గొప్ప కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ పేరుతో నెలకొల్పిన అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ప్రకటించడం ఆయన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇక సంచలన గాయని చిన్మయి కూడా చాలాసార్లు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె కూడా వైరముత్తుకు ఓఎన్వీ అవార్డు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రదానం చేసే విషయాన్ని పునర్ పరిశీలించనున్నట్లు ఓఎన్వీ కల్చరల్ అకాడమీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చదవండి : అవార్డు పొందడం సంతోషంగా ఉంది : వైరముత్తు వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం -
లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం
చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా మరోసారి గళం వినిపిస్తోంది. కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ పురస్కారాన్ని వైరముత్తుకు అందించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో పాటు మాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. కాగా, 2018 మీటూ ఉద్యమ సమయంలో గేయరచయిత వైరముత్తుపైనా చిన్మయితోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్వీ అవార్డు ఇవ్వడం ఇప్పుడు మారం రేపుతోంది. మలయాళ నటి పార్వతి తిరువొతు, గీతూ మోహన్‌దాస్, రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా గొంతు కలిపింది. అర్హతలేని ఆ వ్యక్తి నుంచి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అది జరగదు ఈ విమర్శలపై ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత. అయినా ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజుల్లో ఎవరు.. ఎవరిపైన అయినా ఆరోపణలు చేయొచ్చు. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తాము పోరాటాన్ని ఆపబోమని హీరోయిన్లు స్పష్టం చేశారు. నాన్-మలయాళీ మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు కూడా. -
విజయ్ ఎదురుగానే అర్జున్ రెడ్డిని ఏకిపారేసిన నటి
‘అర్జున్ రెడ్డి’ విడుదలై రెండేళ్లు అయినా ఆ సినిమాపై వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలోనూ తెరకెక్కించడంతో విమర్శకులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించేదాన్నే కాదంటూ కుండబద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్ట్‌వల్ వేదికలో విజయ్ దేవరకొండ ఎదురుగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంపదెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను’ అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్ వ్యాఖ్యలపై హీరో విజయ్ స్పందిస్తూ.. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం.. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. అయినా దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సోషల్ మీడియా హడావుడే తనకు చికాకు కలిగిస్తోందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు’ అంటూ చివరాఖరకు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యాడు రౌడీ. -
మీరు మా ఆత్మగౌరవం : సమంత
సాదారణంగా హీరోయిన్గా మంచి ఫాంలో ఉన్న భామలు తమ సమకాలీన నాయికలపై ప్రశంసలు కురిపించటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే నటి సమంత మాత్రం తన తోటి నటీమణుల ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఓ బేబీ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్న సమంత ఇటీవలే నటి పార్వతి నటించిన మలయాళ చిత్రం ఉయిరే చిత్రాన్ని చూశారట. ఆ చిత్రంలో పార్వతి ప్రేమికుడి చేతిలోనే యాసిడ్ దాడికి గురైన యువతిగా నటించారు. ఒక పైలట్ కావాలని ఆశించిన ఆ యువతి యాసిడ్ దాడికి గురైన తరువాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందీ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ఉయిరే. ఈ చిత్రం గత ఏప్రిల్‌లోనే తెరపైకి వచ్చింది. అయితే నటి సమంత ఇటీవలే చిత్రాన్ని చూశారు. దీని గురించి ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ ఉయిరే చిత్రాన్ని చూడండి. అది మీకు కోపాన్ని తెప్పిస్తుంది. ఏడిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ప్రేమించేలా చేస్తుంది. మీలో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. పోత్సాహాన్నిస్తుంది. ధన్యవాదాలు పార్వతి. మీరు మాకు గొప్ప ఘనత. దర్శకుడు మను అశోకన్, కథారచయిత బాబీసంజయ్లకు శుభాకాంక్షలు అని నటి సమంత ప్రశంసలను కురిపించారు. వెంటనే స్పందించిన నటి పార్వతి ధన్యవాదాలను తెలిపారు. #Uyare .. just watch it 🙏🙏 .. It will make you angry , make you cry , make you think , make you love ,make you have hope and leave you inspired . Thankyou @parvatweets ...you are our pride ❤️ And the team director #Manu and writers #BobbySanjay . Absolutely brilliant 🙌 pic.twitter.com/U36oJpx6Bh — Baby Akkineni (@Samanthaprabhu2) 2 June 2019 -
కథ చెప్తానంటోన్న డాషింగ్ బ్యూటీ
ఒక కథను నిజాయితీగా చెప్పాలనుంది అని అంటోంది నటి పార్వతీమీనన్. ఈ మాలీవుడ్ నటి కోలీవుడ్‌లోనూ సుపరిచితురాలే. మలయాళంలో పలు చిత్రాల్లో నటించి కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న పార్వతీమీనన్. తమిళ చిత్ర పరిశ్రమలోకి ‘పూ’ చిత్రంతో పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరుతెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్ చిత్రంలో నటించింది. అయితే చాలా సెలక్టెడ్ చిత్రాలనే చేసే పార్వతీమీనన్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. తాను అనుకుంది నిర్మొహమాటంగా చెప్పే మనస్థత్వం కలిగిన ఈ బ్యూటీ అలాంటి చర్యలతోనే ఆ మధ్య మాలీవుడ్‌లో వివాదాల్లో చిక్కుకుంది. అయినా నేనింతే అన్నట్టుగా తనకు వచ్చిన అవకాశాలనూ, తనకు నచ్చిన పాత్రలనే నటిస్తానని చెబుతోంది బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీ. సరే ఇంకేంటీ కొత్త విషయాలు అన్న ప్రశ్నకు మెగాఫోన్ పట్టనున్నానని చెప్పింది. ఏంటీ సడన్ నిర్ణయం అని అంటే ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, దర్శకత్వం చేయాలన్నది చాలా కాలంగా తనలో నిగూఢమైన కోరిక అని పేర్కొంది. దర్శకత్వం చేయాలన్నది తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలన్న ఆసక్తి మాత్రం కాదని, నిజాయితీతో కూడిన కథను వెండితెరపై చూపించాలన్న కోరికనేనని చెప్పింది. ప్రస్తుతం అందుకు సన్నాహాలు చేస్తున్న నటి పార్వతీమీనన్ వచ్చే ఏడాది మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ చిత్రం మాతృభాషలోనే ఉంటుందా? లేక తమిళంతో కలిపి రెండు భాషల్లో చేస్తుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
అప్పటి నుంచి మనశ్శాంతి లేదు: హీరోయిన్
ముంబై : బాల్యంలో జరిగే అత్యాచారాలు బాధితులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి... అందుకు తానే ఓ ఉదాహరణ అంటున్నారు హీరోయిన్ పార్వతి. అంతేకాదు అటువంటి సంఘటనలు మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. దక్షిణాది సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ సినిమా ‘కరీబ్ కరీబ్ సింగిల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో జరిగిన మామీ ఫిలిం ఫెస్టివల్‌కి పార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. ‘నేను ఈరోజు ఇక్కడ కూర్చుంది ఓ మనిషిగా. నువ్వు మహిళవు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావంటూ నాపై ముద్ర వేసే అవకాశం ఉంది. అయినా ఫర్లేదు. ఎందుకంటే బాధితుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఏమీ తెలియని వయస్సులో జరిగిన వాటి గురించి ఇప్పుడెలా తెలిసిందోనని వ్యంగ్యమాడే ప్రబుద్ధులు కూడా ఉంటారు. పర్లేదు. మూడేళ్ల ప్రాయంలో నాపై జరిగినవి అకృత్యాలు అని తెలుసుకోవడానికి నాకు పన్నెండేళ్లు పట్టింది. ఈ విషయం తెలిసిన నాటి నుంచి నా మనశ్శాంతి దూరమైంది. దాడి జరగడం అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు. ఆ దాడి తాలూకు చేదు ఙ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. నేను రోజూ వాటితో పోరాడుతూనే ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రతీ విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకునే తాను ఈ విషయంలో మాత్రం ఏళ్లపాటు ఎలా సైలెంట్‌గా ఉన్నానో తనకే అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చారు.( చదవండి : #మీటూ : ‘అతడి మీద అసహ్యంతో డెటాల్ తాగేశా’) -
నటికి రోడ్డుప్రమాదం.. త్రుటిలో తప్పిన ముప్పు!
కొచ్చి : ప్రముఖ మలయాళీ నటి పార్వతి ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుప్రమాదానికి గురైంది. కొచ్చి నుంచి త్రివేండానికి ఒక అద్దె ఇన్నోవా కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. ఆమె వాహనం కారును ఢీకొట్టింది. ఆలపుజా ప్రాంతంలో జాతీయ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా అదుపుతప్పి ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో ఉన్న వారికి పెద్దగా గాయాలు కాలేదు. ఎలాంటి గాయం కాకుండా పార్వతి ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ సినిమాలో నటించిన పార్వతి.. ప్రమాదం తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగింది. ఈ ప్రమాద ఘటనపై రెండు పార్టీలు రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాజాగా ‘టేకాఫ్’ సినిమాకుగాను పార్వతి జాతీయ అవార్డు పొందింది. అయితే, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందివ్వకపోవడంతో.. నిరసిస్తూ.. ఈ కార్యక్రమాన్ని ఇతర అవార్డుల గ్రహీతలతోపాటు ఆమె బహిష్కరించింది. -
వివాదంపై స్పందించిన మెగాస్టార్
పార్వతి-మమ్ముట్టి ఫ్యాన్స్‌కు మధ్య జరుగుతున్న వివాదంపై కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి నోరు విప్పారు. ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందన్నారు. తను వివాదాల జోలికి వెళ్లనని తెలిపారు. మనకు అర్థవంతమైన చర్చలు జరగాలని, నా తరుపున మాట్లాడటానికి ఎవ్వరినీ నియమించలేదన్నారు. అసలు వివాదామేంటీ? తిరువనంతపురంలో జరిగిన ఐఫా వేడుకలో నటి పార్వతి మాట్లాడుతూ.. మమ్ముట్టి నటించిన ‘కసాబా’ సినిమాలోని డైలాగ్‌లు మహిళల్ని అవమానించేరీతిలో ఉన్నాయని అన్నారు. ఆమె నేరుగా మమ్ముట్టి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా...మమ్ముట్టి ఫ్యాన్స్ ఆమెపై సోషల్‌మీడియాలో అసభ్యకర కామెంట్స్‌తో వేధిస్తున్నారు. కొంతమంది హద్దు దాటి రేప్ చేస్తామని బెదిరించారు. మరికొంతమంది చంపుతామని హెచ్చరించారు. వేధింపులు ఎక్కువయ్యేసరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటివి ఇంకెన్నో.. తమిళంలో విజయ్ నటించిన ఓ సినిమాపై జర్నలిస్ట్ ధన్యరాజేంద్రన్ కూడా తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియాలో తెలిపింది. విజయ్ ‘సూర’ సినిమాను ఇంటర్వెల్ వరకు చూడగలిగాను. కానీ, షారుఖ్ ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ ఇంటర్వెల్ వరకు కూడా చూడలేకపోయాననీ, దాని రికార్డ్‌ని షారుఖ్ సినిమా బ్రేక్ చేసిందని ట్వీట్ చేసింది. మరుక్షణం నుంచి విజయ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఆమెపై దాడి చేయడం ప్రారంభించారు. అసభ్యకర పదాలతో వేధించారు. ఈ వివాదంపై విజయ్ స్పందిస్తూ...ఒక మహిళను అలా వేధించడం సరికాదని తన ఫ్యాన్స్‌కి హితబోధ చేశారు. అంతటితో వివాదానికి తెరపడింది. ఇక టాలీవుడ్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న నటుడు పవన్‌కల్యాణ్. ఎవరు వేలెత్తి చూపినా.. ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో దాడి ప్రారంభిస్తారు. ఆ మధ్య అల్లుఅర్జున్ ‘చెప్పను బ్రదర్’ ఎపిసోడ్ తర్వాత సోషల్‌మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే. -
ప్రముఖ నటిపై బూతుల వర్షం.. అరెస్టుల పర్వం
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ మళయాల నటి పార్వతీని సోషల్ మీడియా వేదికగా బూతులతో టార్గెట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఇష్టమొచ్చినట్లుగా తిడుతూ ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టడంతోపాటు వార్నింగ్‌లు కూడా ఇచ్చిన నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పార్వతీ మాట్లాడుతూ మమ్ముటి నటించిన చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన నటించిన కాసాబా చిత్రంలో మహిళలను అవమానించే సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఆ సినిమా చూసినందుకు తాను చాలా బాధపడ్డానని, అలాగే ఆ సినిమా చూసే ప్రతి స్త్రీ బాధపడుతుందని అన్నారు. దాంతో మమ్మూటీ ఫ్యాన్స్ పేరిట పలువురు పార్వతీపై సోషల్ మీడియా వేదికగా దాడులు చేశారు. అసభ్యకర సందేశాలు పంపించడమే కాకుండా ఆమె ప్రాణానికి హానీ చేస్తామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో వాటి తాలుకూ యూఆర్ఎల్స్ మొత్తాన్ని ఆమె పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు సదరు సోషల్ మీడియా వేదికల నుంచి అదనపు సమాచారం కోరుతున్నారు. -
మరో హీరోయిన్‌పై లైంగిక దాడి?
సినీ పరిశ్రమలో సంచలనం కలిగించిన హీరోయన్ భావనపై లైంగిక వేధింపుల వ్యవహారం మరువక ముందే.. మరో మళయాల నటి పార్వతికి అదేతరహాలో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ, సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన కసాబా చిత్రంపై పార్వతి తీవ్ర విమర్శలు చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికగా మమ్ముట్టి తాజా చిత్రం పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వేదికపై ఉన్న మరో నటి గీతూ మోహన్‌దాస్ ఆ సినిమా పేరు చెప్పమని అడగటంతో చివరకు పార్వతి కసాబా చిత్రం పేరు వెల్లడించింది. దీంతో మమ్ముట్టి ఫ్యాన్స్, కొందరు సినిమా పరిశ్రమ పెద్దలు పార్వతిపై మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరకరమైన రీతిలో పార్వతిపై ఎదురు దాడులకు దిగారు. అంతేకాకుండా మమ్ముట్టికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలంటూ మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియా వేదిగా విమర్శలకు దిగారు. అయితే తాజా వివాదంపై పార్వతీ స్పందించారు. కసాబాలో పనిచేసిన నటీనటులను గానీ, మమ్ముట్టిని కించపరచడం తన ఉద్దేశం కాదని యాదృచ్చికంగా జరిగిందంటూ వివరణ ఇచ్చారు. అయినా అనవసర విషయంపై రాద్దాంతం చేయడం సమంజసమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సూపర్‌స్టార్ దిలీప్, మరో నటిపై లైంగికదాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ జైలుకెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా పార్వతి ఘటన కూడా అదే మాదిరిగా ఉందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై మమ్ముట్టి మాత్రం మౌనం వహించారు. -
నన్నూ పడక గదికి రమ్మన్నారు
- నటి, 'మరియాన్' ఫేమ్ పార్వతి సంచలన వ్యాఖ్యలు గాయని సుచిత్ర రేపిన కలకలం ఇంకా సద్దుమణగలేదు. దానికి శాఖలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుసగా ప్రముఖ నటుల రాసలీల దృశ్యాలను తన ట్విట్టర్లో వెల్లడించి సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన సుచిత్ర ఇతర నటీమణుల్లో తెగింపును తెచ్చిపెట్టింది. ఇప్పటికే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, సంధ్య, కస్తూరి లాంటి కొందరు హీరోయిన్లు తమ చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడిం చారు. తాజాగా నటి పార్వతి గొంతు విప్పారు. పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఈ మలయాళీ భామ. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్ డేస్ చిత్రాల్లో నటించారు. ఇక్కడ తను చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారనే చెప్పాలి. మలయాళంలోనూ నటిస్తున్న పార్వతి ఇటీవల ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హీరోయిన్లతో చిత్ర పరిశ్రమలో ఎలా ప్రవర్తిస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు. పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు తనను పలుమార్లు పడక గదికి రమ్మన్నారని, మరి కొందరు సినిమాల్లో ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని అన్నారు. అయితే అలాంటి అవకాశాలు తనకు వద్దని ఖరాఖండిగా చెప్పానని తెలిపారు. తాను తక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం అని నటి పార్వతి పేర్కొన్నారు. అలా అవకాశాలు లేకుండా తాను చాలా కాలం ఖాళీగానే ఇంట్లో కూర్చున్నానని చెప్పారు.