విజేత
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది.
పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.
‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్‌లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్‌లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్‌లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు.
7వ తరగతిలో ప్రమాదం
2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్‌లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.
‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.
మహిళా దివ్యాంగుల కోసం
ఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె.
Comments
Please login to add a commentAdd a comment