సినీ పరిశ్రమలో సంచలనం కలిగించిన హీరోయన్ భావనపై లైంగిక వేధింపుల వ్యవహారం మరువక ముందే.. మరో మళయాల నటి పార్వతికి అదేతరహాలో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ, సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన కసాబా చిత్రంపై పార్వతి తీవ్ర విమర్శలు చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికగా మమ్ముట్టి తాజా చిత్రం పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వేదికపై ఉన్న మరో నటి గీతూ మోహన్‌దాస్ ఆ సినిమా పేరు చెప్పమని అడగటంతో చివరకు పార్వతి కసాబా చిత్రం పేరు వెల్లడించింది.
దీంతో మమ్ముట్టి ఫ్యాన్స్, కొందరు సినిమా పరిశ్రమ పెద్దలు పార్వతిపై మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరకరమైన రీతిలో పార్వతిపై ఎదురు దాడులకు దిగారు. అంతేకాకుండా మమ్ముట్టికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలంటూ మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియా వేదిగా విమర్శలకు దిగారు.
అయితే తాజా వివాదంపై పార్వతీ స్పందించారు. కసాబాలో పనిచేసిన నటీనటులను గానీ, మమ్ముట్టిని కించపరచడం తన ఉద్దేశం కాదని యాదృచ్చికంగా జరిగిందంటూ వివరణ ఇచ్చారు. అయినా అనవసర విషయంపై రాద్దాంతం చేయడం సమంజసమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సూపర్‌స్టార్ దిలీప్, మరో నటిపై లైంగికదాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ జైలుకెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా పార్వతి ఘటన కూడా అదే మాదిరిగా ఉందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై మమ్ముట్టి మాత్రం మౌనం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment