
హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్ట్‌లీ బంగ్లాలో నివసిస్తారు. వారిని చూసేందుకు స్టార్ హీరోల ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఫ్యాన్స్. అంతేకాదు.. కథానాయకుల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎక్కడకు వెళ్తుంటారు? ఇంద్రభవనంలాంటి ఇల్లు లోపల ఎలా ఉంటుంది? ఇలా అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఓ హీరో బంపరాఫర్ ఇస్తున్నారు. తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే హోటల్ మాదిరిగానే ఇక్కడ కూడా రోజుకింత అని డబ్బు కట్టి ఉండొచ్చట.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఇల్లు ఎక్కడ అనేది పూర్తి కథనంలో చదివేయండి..
ఇంటిని అభిమానుల కోసం..
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)కి కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్, కుమారుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ పాతింటికి వస్తూ వెళ్తుంటారట! అయితే సకల వసతులు ఉన్న ఈ ఇంటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. అభిమానులకు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్‌ను అమల్లోకి తెచ్చారు.

ఒక్కరోజు ఉండాలంటే..
ఇంతకాలం ఇంటిని బయటనుంచే ఫోటోలు తీసుకున్న అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్ గదిలో సేద తీరొచ్చు. తండ్రీకొడుకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్ థియేటర్, గ్యాలరీ రూమ్ చూసేందుకు కూడా వీలు కల్పిస్తారట! ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి బుకింగ్స్ మొదలుపెడతారట! ఎంత ఖర్చయినా పర్లేదు, మమ్ముట్టి ఇంటికి వస్తాం.. ఆయన్ను కలుస్తాం అనుకునేరు.. కేవలం ఆయన ఇంట్లో బస చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మమ్ముట్టిని, దుల్కర్‌ను కలిసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు.

దుల్కర్ సల్మాన్ బెడ్‌రూమ్
సినిమా..
మమ్ముట్టి.. చివరగా డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే సినిమా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మమ్ముట్టి బజూక అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీనో డెనిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈయన చివరగా లక్కీ భాస్కర్ చిత్రంతో అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, ఐయామ్ గేమ్ అనే సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: 'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment