పాఠశాల సినిమా రివ్యూ
కాన్సెప్ట్ బావుంది..!
సినిమా రివ్యూ
తెలుగుతెరపై ప్రస్తుతం రెండు రకాల యువతరం కథలు నడుస్తున్నాయి. వాటిల్లో మొదటి రకం పూర్తి స్థాయి వల్గారిటీతో కూడుకున్నవైతే, రెండో రకం సినిమాలు... సున్నిత భావాలను జోడించి, భావుకతను జొప్పించి తీసేవి. ఈ రకం సినిమాల్లో వినోదం ఆమడదూరంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన వినోదం, వేగవంతమైన కథనం, మనసును మెలిపెట్టే సన్నివేశాలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, అద్భుతమనిపించే పాత్రలు... ఇవన్నీ గతంలోని యువతరం సినిమాల్లో కనిపించేవి. ఉదాహరణకు 80ల్లో వచ్చిన ‘చిన్నారి స్నేహం’, 90ల్లో వచ్చిన ‘ప్రేమదేశం’, 2000ల్లో వచ్చిన ‘గమ్యం’ సినిమాలను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సినిమాలు అరుదైపోయాయి. ఇప్పుడొస్తున్న చాలామంది యువ దర్శకులు మంచి పాయింట్స్‌ని ఎంచుకుంటున్నారు కానీ, దాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగ పూరితంగా ప్రేక్షకులకు చేరవేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ శుక్రవారం విడుదలైన యువతరం సినిమా ‘పాఠశాల’. వల్గర్ కామెడీ జోలికి పోకుండా, చక్కని అభిరుచితో, మంచి పాయింట్ ఎంచుకుని దర్శకుడు మహివి.రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా విశేషాలు తెలుసుకునే ముందు కథలోకెళ్దాం.
కథ: రాజు(నందు), సూర్య(శివ), ఆది(సాయికిరణ్), సాల్మా(శిరీషా), సంధ్య(అనుప్రియ)... ఈ అయిదుగురూ మంచి స్నేహితులు. దిగ్విజయంగా బీటెక్ పూర్తి చేస్తారు. అయితే... కాలేజ్‌ని, ఆ జ్ఞాపకాలను, ప్రాణంతో సమానమైన స్నేహాన్ని విడిచి వెళ్లలేక సతమతమైపోతుంటారు. అప్పుడు ప్రిన్సిపల్ వారికి ఓ సలహా ఇస్తాడు. ‘అయిదుగురూ ఎవరింటికి వాళ్లు వెళ్లకుండా, మీ అయిదుగురి ఇళ్లకూ అయిదుగురూ వెళ్లండి. ప్రతి ఇంట్లో కొన్ని రోజులు గడపండి. ఆ ట్రిప్ మీ కెరీర్లకు హెల్ప్ అవ్వడమే కాక, మీకు కొత్త అనుభవాలను అందిస్తుంది’ అని చెబుతాడు. ఆయన సలహా నచ్చి, అందరూ టూర్ ప్లాన్ చేస్తారు. అలా మొదలైన వారి రోడ్ ట్రిప్‌లో ఎలాంటి అనుభవాలు, ఎలాంటి మలుపులు సంభవించాయి? అనేది కథ.
ఎలా చేశారంటే: ఇందులో నటించిన వాళ్లంతా యువకులే. అందరూ తమ పరిధి మేరకు పాత్రలను రక్తికట్టించారు. ఎల్బీ శ్రీరామ్, కృష్ణభగవాన్, నరసింహరాజు లాంటి సీనియర్ నటులు చిన్న పాత్రలు చేసినా గుర్తుండిపోతారు. ద్వితీయార్ధంలో వచ్చే శశాంక్ పాత్ర ఈ కథలో కీలకం. చాలా బాగా నటించాడు తను.
ఎలా తీశారంటే: దర్శకుడు తన అభిరుచి మేరకు మంచి కథాంశాన్ని ఎంచుకున్నారు. ఎక్కువ శాతం సెంటిమెంట్, భావోద్వేగాలపైనే శ్రద్ధ చూపారు. వినోదం పెద్దగా లేకపోవడం, కథనం స్లోగా ఉండటం... చాలామంది ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ, ఇలాంటి క్లీన్ మూవీ తీసినందుకు దర్శకుణ్ణి అభినం దించాలి. కొంచెం శ్రద్ధ పెడితే ఆయనకు మంచి భవిష్యత్తే ఉందనిపిస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం కెమెరా. సినిమా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే తీశారు. లొకేషన్లు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. చాలా సంభాషణలు బాగున్నాయి. సంగీతం ఓకే. మొత్తంగా ఈ సినిమా విజయం తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉండే యువతరంపై ఆధారపడి ఉంది. వారికి నచ్చితే సినిమా హిట్టే.
తారాగణం: శశాంక్, నందు, శివ, సాయికిరణ్, శిరీష, అనుప్రియ, దర్శకుడు: మహి వి. రాఘవ్,
నిర్మాతలు: రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్ రెడ్డి,
సంగీతం: రాహుల్ రాజ్, కెమెరా: సుధీర్ సురేంద్రన్
బలాలు: కథాంశం కెమెరా నటీనటుల నటన సంభాషణలు బలహీనత: స్లో నేరేషన్