pawan kumar reddy
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ
విజయవాడ: గవర్నర్‌పేట సీఐ పవన్ కుమార్ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నగలకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో తెనాలికి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ. ఐదున్నర లక్షలు సీఐ డిమాండ్ చేశారు. నగల వ్యాపారి ఓ పోలీసు ఉన్నతాధికారి బంధువు కావడంతో ఈ విషయాన్ని ఆయనకి తెలియజేశారు. ఈ విషయం చివరికి నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావుకు తెలిసింది. విచారణలో సీఐ డబ్బులు డిమాండ్ చేసినట్లు రుజువు కావడంతో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుల్ విష్ణుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాఠశాల సినిమా రివ్యూ
కాన్సెప్ట్ బావుంది..! సినిమా రివ్యూ తెలుగుతెరపై ప్రస్తుతం రెండు రకాల యువతరం కథలు నడుస్తున్నాయి. వాటిల్లో మొదటి రకం పూర్తి స్థాయి వల్గారిటీతో కూడుకున్నవైతే, రెండో రకం సినిమాలు... సున్నిత భావాలను జోడించి, భావుకతను జొప్పించి తీసేవి. ఈ రకం సినిమాల్లో వినోదం ఆమడదూరంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన వినోదం, వేగవంతమైన కథనం, మనసును మెలిపెట్టే సన్నివేశాలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, అద్భుతమనిపించే పాత్రలు... ఇవన్నీ గతంలోని యువతరం సినిమాల్లో కనిపించేవి. ఉదాహరణకు 80ల్లో వచ్చిన ‘చిన్నారి స్నేహం’, 90ల్లో వచ్చిన ‘ప్రేమదేశం’, 2000ల్లో వచ్చిన ‘గమ్యం’ సినిమాలను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సినిమాలు అరుదైపోయాయి. ఇప్పుడొస్తున్న చాలామంది యువ దర్శకులు మంచి పాయింట్స్‌ని ఎంచుకుంటున్నారు కానీ, దాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగ పూరితంగా ప్రేక్షకులకు చేరవేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ శుక్రవారం విడుదలైన యువతరం సినిమా ‘పాఠశాల’. వల్గర్ కామెడీ జోలికి పోకుండా, చక్కని అభిరుచితో, మంచి పాయింట్ ఎంచుకుని దర్శకుడు మహివి.రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా విశేషాలు తెలుసుకునే ముందు కథలోకెళ్దాం. కథ: రాజు(నందు), సూర్య(శివ), ఆది(సాయికిరణ్), సాల్మా(శిరీషా), సంధ్య(అనుప్రియ)... ఈ అయిదుగురూ మంచి స్నేహితులు. దిగ్విజయంగా బీటెక్ పూర్తి చేస్తారు. అయితే... కాలేజ్‌ని, ఆ జ్ఞాపకాలను, ప్రాణంతో సమానమైన స్నేహాన్ని విడిచి వెళ్లలేక సతమతమైపోతుంటారు. అప్పుడు ప్రిన్సిపల్ వారికి ఓ సలహా ఇస్తాడు. ‘అయిదుగురూ ఎవరింటికి వాళ్లు వెళ్లకుండా, మీ అయిదుగురి ఇళ్లకూ అయిదుగురూ వెళ్లండి. ప్రతి ఇంట్లో కొన్ని రోజులు గడపండి. ఆ ట్రిప్ మీ కెరీర్లకు హెల్ప్ అవ్వడమే కాక, మీకు కొత్త అనుభవాలను అందిస్తుంది’ అని చెబుతాడు. ఆయన సలహా నచ్చి, అందరూ టూర్ ప్లాన్ చేస్తారు. అలా మొదలైన వారి రోడ్ ట్రిప్‌లో ఎలాంటి అనుభవాలు, ఎలాంటి మలుపులు సంభవించాయి? అనేది కథ. ఎలా చేశారంటే: ఇందులో నటించిన వాళ్లంతా యువకులే. అందరూ తమ పరిధి మేరకు పాత్రలను రక్తికట్టించారు. ఎల్బీ శ్రీరామ్, కృష్ణభగవాన్, నరసింహరాజు లాంటి సీనియర్ నటులు చిన్న పాత్రలు చేసినా గుర్తుండిపోతారు. ద్వితీయార్ధంలో వచ్చే శశాంక్ పాత్ర ఈ కథలో కీలకం. చాలా బాగా నటించాడు తను. ఎలా తీశారంటే: దర్శకుడు తన అభిరుచి మేరకు మంచి కథాంశాన్ని ఎంచుకున్నారు. ఎక్కువ శాతం సెంటిమెంట్, భావోద్వేగాలపైనే శ్రద్ధ చూపారు. వినోదం పెద్దగా లేకపోవడం, కథనం స్లోగా ఉండటం... చాలామంది ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ, ఇలాంటి క్లీన్ మూవీ తీసినందుకు దర్శకుణ్ణి అభినం దించాలి. కొంచెం శ్రద్ధ పెడితే ఆయనకు మంచి భవిష్యత్తే ఉందనిపిస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం కెమెరా. సినిమా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే తీశారు. లొకేషన్లు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. చాలా సంభాషణలు బాగున్నాయి. సంగీతం ఓకే. మొత్తంగా ఈ సినిమా విజయం తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉండే యువతరంపై ఆధారపడి ఉంది. వారికి నచ్చితే సినిమా హిట్టే. తారాగణం: శశాంక్, నందు, శివ, సాయికిరణ్, శిరీష, అనుప్రియ, దర్శకుడు: మహి వి. రాఘవ్, నిర్మాతలు: రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్ రెడ్డి, సంగీతం: రాహుల్ రాజ్, కెమెరా: సుధీర్ సురేంద్రన్ బలాలు: కథాంశం కెమెరా నటీనటుల నటన సంభాషణలు బలహీనత: స్లో నేరేషన్ -
సరదా ప్రయాణంలో సంఘటనలు...
ఆ ఐదుగురూ కాలేజ్ డేస్‌ని ఎంజాయ్ చేస్తారు. కాలేజ్ పూర్తయ్యాక ఒకరి ఇంటికి ఒకరు వెళ్లాలనుకుంటారు. వెళ్లిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘పాఠశాల’. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రాకేశ్ మహంకాళి, పవన్‌కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేశ్ మహంకాళి మాట్లాడుతూ -‘‘ఎంతో సరదాగా ప్రయాణం ప్రారంభించిన ఐదుగురు విద్యార్థులు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సంఘటనల ద్వారా ఏం నేర్చుకున్నారు? అనేది సినిమాలో చూడాల్సిందే. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. మహి మాట్లాడుతూ -‘యువ తతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. నందు, సాయిరోనక్, హమీద్, అనుప్రియ, శిరీష, కృష్ణభగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఓ ముఖ్య పాత్రను శశాంక్ చేశారు. -
నిజ జీవిత అనుభవాల ఆధారంగా...
అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... ఈ ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘పాఠశాల’. సాయిరోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మూన్‌వాటర్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మించారు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ, దేవా కట్టా, నందినీ రెడ్డి తమ కళాశాల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాగే సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. నిజ జీవితంలో ఎదురైన అనుభవాలనే ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేశానని దర్శకుడు చెప్పారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని నిర్మాతలు తెలిపారు. -
నరకయాతన
కర్నూలు (హాస్పిటల్), న్యూస్‌లైన్ : కర్నూలు సర్వజనాస్పత్రిలో ‘అనంత’ క్షతగాత్రుల హాహాకారాలు.. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వేసవి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి ప్రమాదానికి గురైన వారు కొందరైతే.. ప్రతి ఏటా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకునే వారు మరికొందరు. విషాదం నింపిన సుంకులమ్మ తిరుణాల ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలో శుక్రవారం రాత్రి సుంకులమ్మ బండి శిల తిరుణాల సందర్భంగా శిడిబండి లాగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా.. మూడు ఎద్దులు చనిపోయాయి. శుక్రవారం రాత్రి గుత్తి ప్రభుత్వాసుపత్రి నుంచి 16 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకొచ్చారు. వీరిలో ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రులకు, 14 మంది ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో ప్రథమ చికిత్స అనంతరం శనివారం తెల్లవారుజామున వీరిని కాలిన రోగుల వార్డుకు మార్చారు. రామరాజుపల్లెకు చెందిన పరమేశ్వరాచారి కుమారుడు మాణిక్యాచారి(18), వెంకటరెడ్డి కుమారుడు పి.సుదర్శన్‌రెడ్డి (16), పెద్దవడుగూరుకు చెందిన బాబయ్య కుమారుడు డి.వన్నూరువలి (12), పెద్దవడుగూరు మండలం కాశేపల్లి గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కుమారుడు జి.సుమంత్‌రెడ్డి(7), యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన ఎస్.వెంకటనారాయణరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి (20)కి 80 నుంచి 90 శాతం శరీరం కాలిపోవడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెద్దవడుగూరుకు చెందిన బాలిరెడ్డి కుమారుడు బాబురెడ్డి(45)కి ఐదు శాతం, ఆదిరెడ్డి కుమారుడు కె.లక్ష్మినారాయణరెడ్డి(35)కు 20 శాతం, రామరాజుపల్లె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి(20)కి 40 శాతం, మడమకులపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి(35)కి 20 శాతం, పెద్దవడుగూరు మండలం కాసిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కుమారుడు జి.ప్రభాకర్‌రెడ్డి(15)కు 20 శాతం, అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీకి చెందిన వి.ప్రవీణ్‌కుమార్(18)కు 30 శాతం, పెద్దవడుగూరుకు చెందిన ఆదినారాయణ కుమారుడు సత్యనారాయణ(35)కు 40 శాతం, చెన్నారెడ్డి కుమారుడు జి.సుధీర్‌రెడ్డి(10), రంగనాయకులు కుమారుడు రామచంద్ర(25)కు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మందిలో నలుగురిని శనివారం కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో 10 మంది, ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. -
ప‘వన’ విజేత
వైవీయూ, న్యూస్‌లైన్ : యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఫలితాల్లో కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి 26వ ర్యాంకు సాధించాడు. రామాపురం మండలం నల్లగుట్టపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడికోట బాలకృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఈయన విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే సాగింది. పాథమిక విద్య రామాపురంలోను, హైస్కూల్ కడప నాగార్జునలోను, ఇంజినీరింగ్ కేఎస్ఆర్ఎం కళాశాలలో పూర్తిచేసిన అనంతరం గేట్లో జాతీయస్థాయిలో 38వ ర్యాంకు సాధించి ముంబయ్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశాడు. అనంతరం టాటాటెక్నాలజీస్ కంపెనీలో సీఏఈ అనలిస్టుగా పనిచేశాడు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రజలకు సేవచేయాలని తరచూ చెప్పే మాటలు ఆయన చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్బాట పట్టాడు. అక్కడ ఒకటిరెండు సార్లు ఒటమి ఎదురైనా కుటుంబసభ్యులు, స్నేహితులు ఇచ్చిన స్ఫూర్తితో యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తొలిప్రయత్నంలోనే దేశంలోనే 26వ ర్యాంకు సాధించి తన పట్టుదలను చాటాడు. ఐఏఎస్ సాధనకు మరోసారి సివిల్స్ రాసి మెయిన్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ఎంతో సంతోషాన్నిస్తోందని పవన్‌కుమార్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు.