
అభిమానులతో పవన్ కల్యాణ్ సమావేశం రద్దు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ సినిమా విజయోత్సవ వేడుకలు, సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పవన్ తన శైలికి భిన్నంగా అభిమానులను కలవాలని భావించారు. సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపేందుకోసం ఆదివారం వారితో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం రద్దయింది. దీనికి గల కారణాలేంటన్నది తెలియరాలేదు. కాగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణం కాదని చిత్ర నిర్మాత ప్రసాద్ చెప్పారు.
'ఆదివారం అభిమానులతో కృతజ్ఞత సమావేశం నిర్వహించాలని భావించాం. అనివార్య కారణాల వల్ల దీన్ని రద్దు చేశాం. కొత్త తేదీని త్వరలో తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో అత్తారింటికి దారేది చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొంటారు' అని ప్రసాద్ చెప్పారు. గత నెల 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు.