
రెండో గబ్బర్‌సింగ్ డిసెంబర్‌లో స్టార్ట్
‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జయభేరి మోగించడంతో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ నామజపమే. ప్రస్తుతం ఆయనేం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆయన ఇవేవీ పట్టించుకోకుండా ‘రెండో గబ్బర్‌సింగ్’ని తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం.
కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకుంది. దర్శకుడు సంపత్‌నందితో పాటు ప్రతిభావంతులైన రచయితల బృందం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పవన్‌కల్యాణ్ దగ్గరుండి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 2 నాటికి ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాలనే కసితో పనిచేస్తున్నారట.
బాలీవుడ్ ‘దబాంగ్’కి రీమేక్ ‘గబ్బర్‌సింగ్’. అయితే... ‘గబ్బర్‌సింగ్-2’ మాత్రం ‘దబాంగ్-2’కు రీమేక్ కాదు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇందులో పవర్‌స్టార్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు పనిచేసే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.