
సత్యదేవ్ దర్శకత్వంలో బాలయ్య
‘లెజెండ్’తో విజయోత్సాహంలో ఉన్న బాలకృష్ణ... తన తర్వాతి చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఇది ఆయన 98వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే నూతన దర్శకుణ్ణి పరిశ్రమకు పరిచయం చేయనున్నారాయన. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రపాటి రమణరావు నిర్మాత. మే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను శుక్రవారం ఓ ప్రకటన ద్వారా నిర్మాత తెలిపారు.
‘‘‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మించనున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చెప్పారు.