
ఢిల్లీ చూపిస్త భామ!
సెలవుల్లో సొంతూరికి స్నేహితులను తీసుకువెళితే ఆ మజానే వేరు. వాళ్లకి అతిథి మర్యాదలు చేయడం, ఊరంతా చూపించడం, ఊరు విశేషాలు చెప్పడం.. అచ్చంగా ఓ గైడ్‌లా అన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఇటీవల తాప్సీ కూడా గైడ్‌లా మారిపోయారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పింక్’. ఈ సినిమా షూటింగ్ అంతా ఢిల్లీలోనే జరిగింది. తాప్సీది ఢిల్లీనే కదా. పుట్టి పెరిగింది, చదువుకుందీ అక్కడే. ప్రతి ఏరియా బాగా తెలుసు.
సొంతూరిలో షూటింగ్ కావడంతో ఎంచక్కా ఇంటి నుంచి షూటింగ్‌కి వెళ్లడం.. రావడం.. ఫ్యామిలీతో కలసి బాగా ఎంజాయ్ చేశారట. అంతే కాదండోయ్.. తాప్సీతో కలసి సినిమాలో నటించిన మిగతా ఇద్దరు భామలు ఆండ్రియా తారింగ్, కీర్తీ కుల్హరిలది ఢిల్లీ కాదు. దాంతో ఢిల్లీ చూపిస్త భామ అంటూ వాళ్లిద్దరి కోసం తాప్సీ పార్ట్‌టైమ్ గైడ్ కింద మారారు. ఢిల్లీ సిటీ అంతా చూపించడంతో పాటు మెట్రో రైల్‌లో తిరగడం, సరోజినీ నగర్ మార్కెట్‌లో షాపింగ్.. పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశానన్నారు. దాంతో పాటు ఓ మంచి పని కూడా చేశారామె. ఆ విషయంలోకి వస్తే...
నేనైతే ఒక్కటిస్తా!
ఓ రోజు ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని ఇంటి దారిపట్టారు తాప్సీ. కారు ఎక్కబోతుండగా.. కొంతమంది అబ్బాయిలు ఓ అమ్మాయిని విచిత్రమైన శబ్దాలతో వెక్కిరించడం ఈ బ్యూటీ కంటపడింది. దాంతో పాటు ద్వందార్థాలతో ఆ అమ్మాయిని ఏడిపించారట. అది భరించలేని తాప్సీ ఆ అబ్బాయిలను చురుగ్గా చూడటంతో వాళ్లు ఖంగు తిన్నారట. అప్పుడా అమ్మాయిని తన కారులో ఎక్కించుకుని, ఇంటి దగ్గర వదిలిపెట్టారట. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ - ‘‘ప్రతి అమ్మాయికీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ధైర్యంగా ఎదిరించాలి. నేనైతే ఒక్కటిస్తా’’ అన్నారు.