అభిమానులకు ఏపీ పోలీస్ బాస్ హెచ్చరిక
సంక్రాంతి రేసులో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నం.150 చిత్రాల విడుదల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఏపీ డీజీపీ శనివారం సమీక్ష నిర్వహించారు.
అంతేకాకుండా అభిమానులు హద్దు దాటితే తాటా తీస్తాం అంటూ హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇతర హీరోల బ్యానర్లు, పోస్టర్లు చించేవారిపై, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీలు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
కాగా ఈ రోజు సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ వేదికగా చిరంజీవి సినిమా "ఖైదీ నంబర్ 150'' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ ప్రకటన ప్రాదాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మెగా వేడుకకు అనుమతి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీస్ బాస్ హెచ్చరికలు అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి.