సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ఓ హోటల్‌లో చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్ పెడతానని ప్రకటించిన వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. వారు విజయవాడ వెళుతుండగా.. ప్రకాశ్‌నగర్ సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తే.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిందేనని వర్మ, రాకేశ్‌రెడ్డిలపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు.
అయితే, ఇందుకు వారు ససేమిరా ఒప్పుకోలేదు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించి తీరుతానని వారు పోలీసులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తాము చేసిన తప్పు ఏంటని, ఎందుకు తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాము ప్రెస్‌మీట్ కూడా పెట్టుకోకూడదా? అని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వైఖరి మార్చుకోని పోలీసులు.. వర్మ, రాకేశ్‌రెడ్డిలను బలవంతంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించి.. విమానాశ్రయం లాంజ్‌లో ఇద్దరిని నిర్బంధించారు. తనను ఎయిర్‌పోర్టులో నిర్బంధించడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నేనేమైనా ఉగ్రవాదినా.. ఎందుకు నన్ను నిర్బంధించారు? నిర్బంధించడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? ఏం అధికారముంది?’ అంటూ పోలీసులపై వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. వర్మ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులు నీళ్లు నమిలారు.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా ఏపీలో చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడ నోవాటెల్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే, చివరి నిమిషయంలో నోవాటెల్ హోటల్‌లో తన ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వలేదని, అంతేకాకుండా తాను ఇచ్చిన అడ్వాన్స్ తీసికొని కూడా హోటల్ యాజమాన్యం తన కార్యక్రమాన్ని రద్దు చేసిందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కొంతమంది పెద్దల బెదిరింపుల వల్లే హోటల్ యాజమాన్యం తనకు అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలో విజయవాడలోని పైపులురోడ్డులో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రకటించిన మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వర్మ, రాకేశ్‌రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వర్మ వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళాలని తనను ఎందుకు బలవంతం చేస్తున్నారని ఆయన పోలీసులను నిలదీశారు. ప్రెస్‌మీట్ వల్ల శాంతిభద్రతల సమస్య వస్తందనే ఉద్దేశంతో అనుమతించడం లేదని పోలీసులు చెప్పుకొచ్చారు. దీంతో కనీసం తనను విజయవాడలోని హోటల్ వరకైనా వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని వర్మ డిమాండ్ చేసినా పోలీసులు ససేమిరా ఒప్పుకోలేదు. ‘పోలీసులు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. నాకు మీడియా సమావేశం పెట్టుకొనే స్వేచ్ఛ లేదా’ అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment