
త్రిషపై రాజకీయ కన్ను
నటి త్రిషపై రాజకీయ కన్ను పడిందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన నటీమణుల్లో త్రిష ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె గురించి ప్రచారమయ్యే వదంతులు ఇన్నీఅన్నీ కావు. వ్యక్తిగత జీవితంలోనూ కలకలమే. ఇటీవల నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రేమ, పెళ్లి వరకూ దారితీసి ఆగిపోయిన వైనం ఇటు చిత్రపరిశ్రమలోనూ, అటు త్రిష అభిమానుల్లోనూ వేడి పుట్టించింది. ప్రస్తుతం వరుస చిత్రావకాశాలతో బిజీగా ఉన్న ఈ సంచలన నటిలో మరో కోణం ఉంది. అదే మానవతా దృక్పథం. త్రిషకు మూగ జీవాలంటే ఎనలేని ప్రేమ. ముఖ్యంగా శునక ప్రేమ అధికం. రోడ్డు పక్కన అనాథగా పడున్న కుక్క కంటబడితే వెంటనే దాన్ని అక్కున చేర్చుకుంటారు.
ఇంటికి తీసుకెళ్లి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు. అదేవిధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ పలు విషయాలపై అవగాహన కలిగిస్తుంటారు. నటి రోజా, కుష్భూ వంటి నటీమణులు ఇప్పటికే రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. మరో సంచలన నటి నమిత కూడా రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే సాధారణంగా ప్రముఖ నటీమణులను బయటి ప్రపంచంలో చూడడం అరుదయిన విషయం. అలాంటిది త్రిష ఇటీవల మెట్రో రైలులో సందడి చేసి మరోసారి తన సహజ నైజాన్ని ఆవిష్కరించారు. ఇవన్నీ కూడితే త్రిషకు రాజకీయరంగ అరంగేట్ర ఉద్దేశం ఉన్నట్లు భావించే అవకాశం లేకపోలేదు. అయితే ఈమెను రాజకీయాల్లోకి లాగాలనే ప్రయత్నాలు ఇదివరకే జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడులో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ కన్ను త్రిషపై పడినట్లు తెలుస్తోంది. ఆమెను ప్రచారానికి వాడుకోవాలని ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తునట్లు సమాచారం.