
శింబుతో మరోసారి త్రిష
సంచలన తార త్రిష నూతన చిత్రాల ఎంపికను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నటుడు శింబుతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం నిలిచిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం కూడా త్రిష కొత్త చిత్రాలను ఒప్పుకుంటూపోవడమే అనే టాక్ వినిపిస్తోంది. త్రిష పెళ్లి నిశ్చితార్థానికి ముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లిపీటలెక్కుతారనే ప్రచారం అప్పట్లో జరిగింది.
అలాంటిది నిశ్చితార్థం తరువాత కూడా నూతన చిత్రాలను అంగీకరించడంతో వరుణ్‌మణియన్‌తో పెళ్లికి చిక్కులు తలెత్తినట్లు కోడంబాక్కం ప్రచారం. ఇప్పటికే త్రిష తన మేనేజర్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంతో పాటు, భోగి అనే చిత్రాన్ని అంగీకరించారు. తాజాగా శింబుతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. శింబుతో కలసి ఇప్పటికే అల, విన్నైతాండి వరువాయా చిత్రాల్లో నటించారు. ముచ్చటగా మూడవసారి సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరోసారి నటించడం చాలా సంతోషకరమైన విషయం అని త్రిష తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈమె ఇంతకుముందు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో నటించారు. తాజా చిత్రం మేలో ప్రారంభం కానుందని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, అరవింద్ కృష్ణ చాయాగ్రహణం అందించనున్నారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించనున్నారని తెలిసింది.