పిన్స్ హీరోగా ‘బన్నీ ఎన్ చెర్రీ’
‘‘నేను పరిచయం చేసినవాళ్లెవరైనా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటాను. ఆ విధంగా ‘నీకు నాకు డాష్ డాష్’ చేసేటప్పుడు ప్రిన్స్‌కి మంచి పేరు రావాలని కోరుకున్నాను. రాజేష్ తనకో కథ చెప్పాడని, ఆ సినిమా చేద్దామనుకుంటున్నానని ప్రిన్స్ నాతో అన్నాడు. మంచి బేనర్లో చేస్తే బాగుంటుందని మల్టీ డైమన్షన్‌ని సూచించాను. ఆ సంస్థతో పాటు టైటిల్ కూడా క్యాచీగా కుదరడం ఆనందంగా ఉంది’’ అన్నారు తేజ.
ప్రిన్స్, మహత్, కృతి, సభా ముఖ్యతారలుగా పి. రామ్మోహన్‌రావు సమర్పణలో మల్టీడైమన్షన్ పతాకంపై రజత్ పార్థసారధి నిర్మిస్తున్న చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’. రాజేష్ పులి దర్శకుడు. ఈ చిత్రం లోగోను మారుతి, టీజర్‌ను తేజ ఆవిష్కరించారు. అనంతరం ఇందులో ముఖ్య పాత్ర చేసిన యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ - ‘‘30 ఏళ్ల క్రితం నేను రాసిన ‘తులసీదళం’ కథలోని కొన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి సైంటిఫిక్ థ్రిల్లర్ రాలేదు’’ అన్నారు.
ఈరోజుల్లో, బస్టాప్ చిత్రాలకు రాజేష్ మంచి సలహాలిచ్చాడని, ఈ సినిమాని బాగా తీసి ఉంటాడని భావిస్తున్నానని మారుతి చెప్పారు. రాజేష్ మాట్లాడుతూ -‘‘ప్రిన్స్ ద్వారా నేను తేజగారిని కలిశాను. ఆయన సూచన మేరకు ఈ బేనర్ కుదిరింది. నా మీద, ఈ కథ మీద నమ్మకంతో ప్రాజెక్ట్ హెడ్ సుధీర్‌రావు ఈ అవకాశం ఇచ్చారు’’ అన్నారు. ఇది సైంటిఫిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని మల్టీడైమన్షన్ వాసు చెప్పారు. ఈ కథ విని థ్రిల్ అయ్యానని ప్రిన్స్ తెలిపారు.