‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’ | Priyadarsi And Rahul Ramakrishna Mithai Movie Audio Function | Sakshi
Sakshi News home page

‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’

Published Sat, Feb 16 2019 11:09 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Priyadarsi And Rahul Ramakrishna Mithai Movie Audio Function - Sakshi

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియోను శుక్రవారం  విడుదల చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి స్వీకరించారు.

ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే... అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. మిఠాయి విషయానికి వస్తే... ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ సైన్మా, పెళ్లి చూపులు చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా’ అన్నారు.

దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల నుంచి ప్రశాంత్ కు సినిమాలంటే చాలా ఇష్టం. లక్కీగా నేను ముందు దర్శకుడు అయ్యా. మిఠాయితో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇది ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్ గానీ... తను ఫాలో అయ్యే యాక్టర్స్ గానీ డిఫరెంట్ లెవెల్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్.. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు హీరో వివేక్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అన్నారు.

దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం హుషారు షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’ అన్నారు.

సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా... షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ... అందరూ ఎంతో హెల్ప్ చేశారు’ అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు. సెట్స్ లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేది కాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement