
అర్జున్ రెడ్డి సినిమాలో నటించి విజయ్ దేవరకొండ ‘బెస్ట్ ఫ్రెండ్’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. తన కామెడీ టైమింగ్‌తో అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందిన ఈ కమెడియన్ ట్విటర్ నుంచి వైదొలిగారు. దీనికి గల కారణం ఆయన ఇటీవల నటించిన సినిమా ‘మిఠాయి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడమే. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది.
ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ‘మిఠాయి’ చిత్రం ఈ నెల 22(శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాహుల్ తన ట్విటర్ ద్వారా ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలియజేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. అనంతరం ట్విటర్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు.
‘మేము సినిమా బాగా రావటానికి చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి మా ప్రయాత్నాలేవి ఫలించలేదు. సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ముందే అంచనా వేశాను. సినిమా పరాజయానికి నేనే క్షమాపణలు తెలుపుతున్నా. దర్శకుడు ఆలోచన, ఊహలను ఇప్పటికీ గౌరవిస్తున్నా’’ అని తన చివరి ట్వీట్‌లో రామకృష్ణ పేర్కొన్నారు. అయితే తన అకౌంట్ తాత్కాలికంగా డి యాక్టివ్ వేట్ చేశారా? లేక శాశ్వతంగా డిలీట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.