
కృష్ణానగరే మామ..కష్టాల కడలే!
లైఫంతా సినిమా మామ సినిమాయే లైఫురా మామ...కళ్ల నిండా కలలతో జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్‌లో కనిపిస్తారు.ఇప్పుడు వారికి కలలొచ్చే పరిస్థితి లేదు. కంటి నిండా కునుకు లేదు. పెద్ద నోట్ల రద్దుతో షూటింగులు కుంటుపడి, పని లేక కిస్తులు, పస్తులతో సతమతమవుతున్న జూనియర్ ఆర్టిస్టులపై ఓ రిపోర్ట్.
హైదరాబాద్‌లో సినీ శ్రమజీవులు ఉండే కృష్ణానగర్ - ఇందిరా నగర్ - గణపతి కాంప్లెక్స్... సినిమాల్లో బోల్డంత మంది జనాలు నిలబడే సీన్స్‌లో కనిపిస్తారే (జూనియర్ ఆర్టిస్టులు)...ఈ మూడు ఏరియాలూ వాళ్ల అడ్డా. ఎప్పుడూ ఈ ఆర్టిస్టులతో ఈ మూడు ఏరియాలూ కిటకిటలాడుతుంటాయ్.
గత రెండు వారాలుగా కూడా జనం కిటకిటలాడుతున్నారు. కానీ, వారి మానసిక స్థితి మాత్రం మారిపోయింది. ఎవరి ముఖాల్లోనూ కళలేదు. ‘పెద్ద నోటు పోటు’ని తట్టుకోలేకపోతున్నారు. చాలావరకూ షూటింగ్స్ ఆగిపోయాయి. జరుగుతున్న కొద్ది షూటింగ్స్‌లోనూ... ఇంతమందికీ ఉపాధి లేదు. దాంతో, వీళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుటి సరదా మాటలు లేవు.. జోష్ లేదు. పెద్ద నోట్లు ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చిన్న కార్మికులను ఇబ్బందుల్లో పడేసింది. సమస్య ఏంటంటే...
ఇరకాటంలో చిన్నవాళ్లు
పాత నోటు స్థానంలో కొత్త నోటు రావడం, పాత నోట్లను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, బ్యాంకులో డబ్బున్నా కావల్సినంత తీసుకోలేకపోవడంతో చిన్న నిర్మాతలు ఇరకాటంలో పడిపోయారు. డబ్బులు సర్దుబాటు చేయలేక షూటింగులు ఆపేశారు. వాస్తవానికి పెద్ద సినిమాలు ఆరేడు నిర్మాణంలో ఉంటే.. చిన్న సినిమాలు పదుల సంఖ్యలో సెట్స్‌పై ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు ఈ చిన్న, మధ్యశ్రేణి సినిమాలే కొండంత అండ. తీరా ఇప్పుడు దానికి గండి పడింది.
అసలింతకీ ఈ జూనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు ఎలా వస్తుంటాయి? మొన్నటి దాకా పరిస్థితి ఎలా ఉంది? ఆ విషయానికొస్తే...
క్లాస్... మధ్యస్థం... మాస్!
దాదాపు అన్ని ఉద్యోగాల్లోనూ గ్రేడులున్నట్లే.. ‘జూనియర్ ఆర్టిస్టు’లకు కూడా గ్రేడులుంటాయి. ‘ఎ’, ‘బి’, ‘సి’ అని మూడు గ్రేడ్‌లు. ‘ఎ’ అంటే క్లాస్, ‘బి’ అంటే మధ్యస్థం, ‘సి’ అంటే పక్కా లోకల్. వీళ్లల్లో ‘ఎ’ క్లాస్‌వాళ్లు భారీ సినిమాల్లో వచ్చే ఫంక్షన్ సీన్స్, ఇతరత్రా సన్నివేశాల్లో చేస్తారు. ఇక, కాలేజీ, కోర్టు వంటి సన్నివేశాలకు ‘బి’ గ్రేడ్‌వాళ్లు పనికొస్తారు. పక్కా ఊర మాస్ సీన్స్‌ని ‘సి’ గ్రేడ్ వాళ్లు చేస్తారు. ‘‘సినిమాల్లోని కథ, షూటింగ్ అవసరాన్ని బట్టి వీళ్లల్లో ఎ, బి గ్రేడ్‌లవాళ్లకు సగటున నెలలో 15 నుంచి 20 రోజులు షూటింగ్ ఉంటుంది. ‘సి’ వాళ్లకు 5 నుంచి 10 రోజులు ఉండడం గగనం’’ అని తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి సత్యనారాయణ ‘సాక్షి’తో అన్నారు. తాజా నోట్ల మార్పు పరిణామం కారణంగా హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ మూడు గ్రేడ్‌ల వాళ్లకూ సరిగ్గా పని లేదని తెలిపారు.
బ్రేక్‌కి బ్రేక్ ఎప్పుడో?
తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యుల సంఖ్య దాదాపు 2,500. షూటింగ్‌లన్నీ జోరుగా జరు గుతూ ఫిల్మ్‌నగర్ కళకళలాడుతున్నప్పుడే వీళ్లందరికీ పని దొరకడం కష్టం. అలాంటిది... ఇప్పుడు షూటింగ్‌లకు ‘కరెన్సీ దెబ్బ’ పడ్డాక మరీ కష్టమైంది. హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’, కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా, మరికొన్ని భారీ సినిమాలు మినహా మెజారిటీ ఛోటా సినిమా షూటింగులకు బ్రేకులు పడ్డాయి. పాత నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్ని రోజులు ‘బాహుబలి-2’ షూటింగ్ జరిగింది. దాంతో సినిమా ప్రధాన షూటింగ్ దాదాపు పూర్తయింది.
ఈ సినిమాలో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా ఉంటే, కొన్ని సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్నాయి. సంక్రాంతి పండగకు వచ్చే సినిమాల్లో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం మీద జూనియర్ ఆర్టిస్టులకు ఈ మధ్య ఎప్పుడూ రానంత ‘లాంగ్ బ్రేక్’ వచ్చింది. మరి.. ఈ బ్రేక్‌కి బ్రేక్ పడేదెప్పుడో?
సిక్స్ టు సిక్స్ జాబ్
ఏ జాబ్ అయినా 9 టు 6 ఉంటుంది. కానీ, జూనియర్ ఆర్టిస్టులది మాత్రం పన్నెండు గంటల కాల్షీట్. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చేయాల్సిందే. ఆరు దాటిందంటే మాత్రం ఆ రోజు వారీ వేతనానికి, అదనంగా మరో సగం చేర్చి మొత్తం చెల్లిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్ జరిగినప్పుడు భోజనం పెడతారు. భోజనం లేకపోతే వంద రూపాయలిస్తారు. ఒకవేళ రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటితే అప్పుడు ‘డబుల్ కాల్షీట్’కి (డబుల్ పేమెంట్) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ‘కన్వేయన్స్’ (అంటే రానూ పోనూ ఛార్జీలు) కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ‘యూనియన్’ రూల్ ప్రకారమే జరగాలి. అయితే, ‘‘కన్వేయన్స్ విషయంలో కొన్ని కంపెనీలు ఫర్వాలేదు. కానీ, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం ఇవ్వడం లేదు. రూల్ ప్రకారంగా అయితే రూ. 150 ఇవ్వాలి’’ అని ఓ జూనియర్ ఆర్టిస్ట్ బాధ వెళ్లగక్కారు.
అన్నం పెట్టే నిర్మాతను అర్థం చేసుకోవాలి!
ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కావడంతో షూటింగ్ పెట్టుకున్నా, ‘క్యాష్’ ఇవ్వలేని పరిస్థితిలో నిర్మాత ఉన్నాడు. దాంతో లావాదేవీలన్నీ ‘చెక్’ రూపంలోనే జరుగుతున్నాయ్. ఇచ్చిన చెక్ చెల్లిందా ఓకే. చెల్లకపోతే ఆ కంపెనీ చుట్టూ తిరగక తప్పదు. జూనియర్ ఆర్టిస్టుల విషయంలో ఈ బాధ్యత అంతా యూనియనే తీసుకుం టుంది. ఒకవేళ ఏ నిర్మాత అయినా షూటింగ్ పెట్టుకోవా లనుకుంటే, చెక్ తీసుకోవడానికి యూనియన్ అంగీకరి స్తోంది. యూనియన్ ఆమోదించింది కాబట్టి... ఒకటీ రెండు రోజులు దొరికే పనిని కాదనకుండా ఒప్పుకుంటు న్నారు చిన్న కళాకారులు.
‘‘అన్నం పెట్టే నిర్మాతను అర్థం చేసుకోవాలి. అందుకే ‘చెక్’ని ఆమోదిస్తున్నాం’’ అని తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలు కూరి సత్యనారాయణ తెలిపారు. వెరసి, మొన్న నవంబర్ 8 తర్వాత నుంచి చేతి నిండా పని లేక, చేతుల్లో డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందులతో చిన్న కళాకారులు బతుకు బండిని భారంగా లాగుతున్నారు. - ‘సాక్షి’ సినిమా డెస్క్
‘‘మాదంతా క్యాష్ అండ్ క్యారీ. పాత నోట్ల రద్దుతో కొన్ని నిర్మాణ సంస్థలు చెక్కులిస్తామంటున్నాయి. ఒకవేళ ఆ చెక్కులు బౌన్స్ అయితే? సినిమా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాలి. నెలకోసారి బిల్ చెల్లించే విధంగా కొన్ని మెస్‌లు షూటింగులకు టిఫిన్స్, మీల్స్ సప్లై చేస్తున్నాయి కానీ, షూటింగులు తగ్గడంతో వాళ్లకూ వ్యాపారం లేదు. మొత్తం మీద యాభై శాతం అమ్మకాలు తగ్గాయ్. ఇప్పుడు జనాల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. వంద నోటున్నోడు ఖర్చు పెట్టడానికి, తినడానికి కూడా ఆలోచిస్తున్నాడు. భారీ ఉద్యమాలు, బంద్‌లు కూడా మా వ్యాపారాలపై ఇంత ప్రభావం చూపలేదు’’ - రత్నం, ‘మంగా’ టిఫిన్ సెంటర్ ఓనర్, కృష్ణానగర్
‘‘ఎక్కువగా చిన్న సినిమా షూటింగులకు నోట్లు బ్రేకులు వేశాయి. దాంతో చాలా మంది ఖాళీనే! ‘షెడ్యూల్ క్యాన్సిల్ అయితే నిర్మాత నష్టపోతాడు. లెక్కలు తర్వాత... ముందు షూటింగ్ చేయండి’ అని ప్రొడక్షన్ మేనేజర్లు అంటున్నారు. లేటైనా డబ్బులు ఇస్తారనే నమ్మకంతో మిగతావాళ్లు షూటింగులకు వెళ్తున్నారు. లేదంటే పాత నోట్లు తీసుకుంటున్నారు.’’ - నారాయణ, ఓ జూనియర్ ఆర్టిస్ట్
లోకల్ కన్నా ముంబై మోడల్స్‌కే ఎక్కువ
జూనియర్ ఆర్టిస్ట్‌లు వేరు... మోడల్స్ వేరు. పబ్ సాంగ్స్, విదేశాల్లో తీసే పాటలకు, కాస్ట్‌లీ సీన్స్‌కూ జూనియర్ ఆర్టిస్టులకు కాకుండా మోడల్స్‌కే ప్రాధాన్యం ఇస్తారు. హైదరాబాద్ మోడల్స్‌కైతే రోజుకి రూ. 1,000 నుంచి 2,000 వరకూ ఉంటుంది. రానూ పోనూ ఛార్జీల కింద రూ. 150 నుంచి రూ. 200 వరకూ వస్తారు. అదే ముంబై మోడల్స్‌కి అయితే రూ. 5,000 వరకూ పారితోషికం ఉంటుంది. రానూపోనూ ఫ్లైట్ ఛార్జీలు, హోటల్‌లో బస - అన్నీ నిర్మాతే చూసుకోవాలని ఒక ప్రముఖ చిత్ర నిరా ్మణ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ వెంకట్ తెలిపారు.
జూ.ఆర్టిస్ట్ పారితోషికం
(ఒక కాల్షీట్‌కి)
ఎ గ్రేడ్ రూ. 650
బి గ్రేడ్ రూ. 650
సి గ్రేడ్ రూ. 550
ఉదయం 6 గంటల కాల్షీట్ అయితే ‘ఏ’, ‘బి’ గ్రేడ్‌వారికి రూ. 650 ఇవ్వాలి, సాయంత్రం ఆరు దాటితే మరో సగం కాల్షీట్‌కి కూడా పే చేయాలి. ఒకవేళ రాత్రి తొమ్మిది కూడా దాటితే డబుల్ కాల్షీట్ పేమెంట్ ఇవ్వాలి. ఒకటిన్నర కాల్‌షీట్ కింద ‘ఏ’, ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్ట్‌లకు రూ. 975, ‘సి’ గ్రేడ్ జూనియర్ ఆర్టిస్ట్‌లకు రూ. 825 దక్కుతుంది.
కాస్ట్యూమ్ కాస్ట్!
మామూలుగా సినిమాల్లో పెద్ద ఆర్టిస్టుల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు - ప్రతి ఒక్కరూ పాత్రను బట్టి వేసుకునే దుస్తులు నిర్మాతే సమకూర్చాలి. ఒక్కోసారి వాళ్లే తెచ్చుకుంటారు. జూనియర్ ఆర్టిస్టులు మాత్రం దాదాపు తమ సొంత బట్టలతోనే షూటింగ్స్‌లో పాల్గొంటారు. అందుకు గాను చిన్న నిర్మాత అయితే డ్రెస్‌కి రూ. 100, పెద్దవాళ్లైతే రూ. 200 వరకూ వాళ్ళకు ఇస్తారు.
భోజనం ఖర్చు
ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉదయం లొకేషన్‌కి వచ్చినప్పటి నుంచి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పే వరకూ.. నిర్మాతే భోజన వసతి సమకూర్చాలి. రాగానే టీ లేక కాఫీ, ఆ తర్వాత టిఫిన్, మధ్యాహ్న భోజనం లోపు ఓ రెండు సార్లు టీలు, భోజనం తర్వాత సాయంత్రం టీ, స్నాక్స్ ఇలా అన్నీ ఇస్తారు. దీనికి గాను ఒక్కో జూనియర్ ఆర్టిస్ట్‌కి రోజుకి అయ్యే ఖర్చు రూ. 150 నుంచి రూ. 175 వరకూ ఉంటుంది.