
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించారు. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యాయని అన్నారు.
మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా నాలుగు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే నితిన్ హీరోగా శ్రీనివాస కల్యాణం, రామ్ హీరోగా ఒక సినిమా, మరో సినిమా కూడా తీస్తున్నామన్నామని చెప్పారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
ఈసందర్భంగా ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఉత్తరరాజగోపురంలో జరిగిన శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమాన్ని తిలకించి స్వామిని దర్శించుకున్నారు. శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమంలో రావడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. చిరంజీవి సేవాసమితి అధ్యక్షుడు లంక సూరిబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment