బిగ్‌బాస్‌: పునర్నవి ఆమెను టార్గెట్‌ చేసిందా? | Punarnavi Bhupalam Is Lady Monark In The Bigg Boss 3 Telugu House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: పునర్నవి ఆమెను టార్గెట్‌ చేసిందా?

Sep 11 2019 5:32 PM | Updated on Sep 11 2019 5:41 PM

Punarnavi Bhupalam Is Lady Monark In The Bigg Boss 3 Telugu House - Sakshi

మోనార్క్‌.. ఎవరి మాట వినదు అని పేరు తెచ్చుకున్న ఏకైక లేడీ పునర్నవి భూపాలం. బిగ్‌బాస్‌.. ఇచ్చే టాస్క్‌ చేయడానికి ఇంటి సభ్యులు ఎవరూ వెనకడుగు వేయరు. అవసరమైతే మూడు చెరువుల నీళ్లు తాగడానికైనా రెడీ అంటారు. అలాంటిది నచ్చితే చేస్తా.. లేకుంటే లైట్‌ తీస్కుంటా అని భావించే ఒకే ఒక్క కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అందాల రాక్షసిగా పునర్నవి పేరు తెచ్చుకుంది. ఇంట్లోకి రాగానే మొదట అందరితో కలవడానికి కాస్త సంకోచించినా నెమ్మదిగా వరుణ్‌, వితిక, రాహుల్‌తో మంచి దోస్తానా చేసింది. ఇక రానురానూ ఇంటి సభ్యులందరితోనూ కలిసిపోసాగింది. ఇక రాహుల్‌కు నాకు మధ్య ఏమీ లేదంటూనే గోరు ముద్దలు తినిపించింది.

ఓ టాస్క్‌లో అయితే శ్రీముఖి రాహుల్‌పై అరుస్తుంటే అడ్డుపడి రాహుల్‌ను వెనకేసుకు వచ్చింది. తప్పు చేస్తే ఫ్రెండైనా ఎవరైనా శిక్ష పడాల్సిందే అంటూ రాహుల్‌ను కొన్నిసార్లు ఎలిమినేషన్‌కు కూడా పంపించింది. కానీ ఇప్పుడు ఇలా ఏదైనా మొహం మీదే చెప్పే మనస్తత్వమే తనకు ఇబ్బందిగా మారనుంది. తాజాగా ‘ఇంట్లో దెయ్యం-నాకేం భయ్యం’ టాస్క్‌లో ఏకంగా బిగ్‌బాస్‌కే వార్నింగ్‌ ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘నువ్వేమైనా తోపా.. బిగ్‌బాస్‌కే వార్నింగ్‌ ఇస్తున్నావ్‌! అంత ఆటిట్యూడ్‌ పనికిరాదు’ అని పునర్నవిపై ఫైర్‌ అయ్యారు. మరికొంతమందేమో ‘బిగ్‌బాస్‌ ఇచ్చే చెత్త టాస్క్‌లను ఇంటిసభ్యులంతా కిమ్మనకుండా చేస్తున్నారు. నువ్వొక్కదానివే వాటిని ఎదిరించే ధైర్యం చేస్తున్నావు’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు.

ఇక విచిత్రంగా ఎనిమిదో వారానికిగానూ నామినేషన్‌ కింగ్‌ రాహుల్‌కు బదులుగా పునర్నవి ఎలిమినేషన్‌కు వెళ్లింది. అయితే ఈసారి పునర్నవి సేవ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తనకు బయట గట్టి ఫాలోయింగ్‌ ఉండటంతో పాటు. ఎలిమినేషన్‌లో ఉన్న శిల్ప చక్రవర్తిపై కాస్త నెగెటివిటీ ఉండటం పునర్నవికి కలిసొచ్చే అంశం. అంతేకాక రేటింగ్‌ కోసమైనా బిగ్‌బాస్‌ ఇప్పుడప్పుడే ఆ జంటని విడగొట్టే ప్రయత్నం చేయడని అనాలసిస్‌ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. కాగా పునర్నవి గట్టిగా అరిచి అందరి మైండ్‌ డైవర్ట్‌ చేసి గేమ్‌ ఆడటమే స్ట్రాటజీగా పెట్టుకుంది అని శ్రీముఖి చెప్పినప్పటికీ దాన్ని పెద్దగా ఎవరూ ఖాతరు చేసినట్టు అనిపించటం లేదు. దీంతో శ్రీముఖి ప్లాన్‌ బెడిసికొట్టినట్టయింది. పైగా బద్ద శత్రువైన రాహుల్‌ను వదిలేసిన శ్రీముఖి ఈ సారి పునర్నవిని టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తుంది. మరి పునర్నవి  ఊరుకుంటుందా..? తను కూడా శ్రీముఖిని టార్గెట్‌ చేయడం స్టార్ట్‌ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మరింత రసవత్తరం కానున్న ఆటలో పునర్నవి ఏ స్ట్రాటజీతో ముందుకు వెళుతుందో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement