
మంటల మధ్య సాహసం...
గులాబీ బాల రాయ్ లక్ష్మి(లక్ష్మీ రాయ్ తన పేరును ఈ విధంగా మార్చుకున్నారు) గాయపడ్డారు. ఆమెను గాయాలపాలు చేసిన ఆ పాపాత్ముడు ఎవరూ అని అభిమానులు తిట్టుకునే అవకాశం ఉంది. కానీ, రాయ్ లక్ష్మిని ఎవరూ గాయపర్చలేదు. ఓ రియాల్టీ షో కోసం రియల్‌గా ఫైట్ చేయడానికి రంగంలోకి దిగారామె. ఆ వేదికపై పలువురు తారలు రిస్కీ ఫైట్స్ చేశారట. ఆమె కూడా ఏం తక్కువ తినలేదంటూ డూప్ లేకుండా రాయ్ లక్ష్మి ఫైట్ చేయడానికి రంగంలోకి దిగారు. మంటల్లోంచి తప్పించుకునే సీన్ అది.
స్వతహాగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుని ఉన్నందువల్ల నదురూ బెదురూ లేకుండా మంటల్లోకి దూసుకెళ్లారామె. ఆ సమయంలో కాలు సరిగ్గా అక్కడున్న ఇనుప కడ్డీకి తగిలింది. దాంతో రాయ్ లక్ష్మి విలవిలలాడిపోయారు. ఆమెకు తగిలిన గాయం చూసి, వారాల తరబడి విరామం తీసుకుంటేనే తగ్గుతుందని చాలామంది భావించారట. కానీ, కేవలం రెండే రెండు రోజులు విశ్రాంతి తీసుకుని, ఆమె షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయిపోయారు. ‘‘గాయం తాలూకు నొప్పి ఎక్కువగానే ఉన్నా, షూటింగ్ చేసేస్తున్నా. నా కారణంగా దర్శక, నిర్మాతలు ఇబ్బందిపడకూడదు కదా’’ అని పేర్కొన్నారు రాయ్ లక్ష్మి.