శిరీష్, అనిల్ రావిపూడి, రాఘవేంద్రరావు, మెహరీన్, ‘దిల్’ రాజు, లక్ష్మణ్
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి.
వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్‌ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి.
‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్‌లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్‌టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్‌లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్.
Comments
Please login to add a commentAdd a comment