
సినిమాల్లో...రెయిన్ ఎఫెక్ట్
హీరోయిన్ పరిగెడుతూ ఉంది. వెనుక విలన్ కత్తితో వెంటాడుతున్నాడు. ఆ సీన్ అలాగే తీస్తే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాని ఆ సమయంలోనే వాన పడితే? ఆ ఎఫెక్ట్ రెట్టింపు అవుతుంది. తనను అరెస్ట్ చేసిన ఎస్‌ఐ మీద పగ తీర్చుకోవడానికి రౌడీ ఎస్‌ఐ ఇంటి మీదకు అర్ధరాత్రి వచ్చాడు. ఎస్.ఐ భార్య ఒంటరిగా ఉంది. అప్పుడే వాన మొదలయ్యింది. ఇక ప్రేక్ష కుల మనసు రోమాంచితం అవుతుంది. హీరో ఒక శ్మశానంలోకి అడుగు పెట్టాడు. వెంటనే వాన మొదలయ్యింది. సమాధి మీద శిలువ తడవడం మొదలుపెట్టింది. ఇది సృష్టించే ఎఫెక్ట్ చిన్నది కాదు. వాన... సినిమాలో చాలా మేజిక్ చేస్తుంది. గిమ్మిక్ సృష్టిస్తుంది. ప్రేక్షకులను ఒక క్షణంలో రొమాంటిక్ మూడ్‌లోకి అంతలోనే బీభత్సమైన వాతావరణంలోకి తీసుకువెళుతుంది.
సినిమాను కనిపెట్టిన హాలీవుడ్ వాళ్లు సినిమాలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా ముందే కనిపెట్టారు. అందుకే 1952లోనే ‘సింగింగ్ ఇన్ ది రెయిన్’ వంటి సినిమాలు తీసి హిట్ చేసుకున్నారు. హిందీలో రాజ్‌కపూర్ ‘బర్సాత్’ తీసినా ‘శ్రీ420’లోని ‘ప్యార్ హువా’ పాటలోనే రెయిన్ ఎఫెక్ట్‌ను గొప్పగా ఉపయోగించి ఆ పాట వల్లే కోట్లు సంపాదించలిగాడు. తెలుగులో ‘ఆత్మబలం’లో ‘చిటపట చినుకులు’... ఇప్పటికీ నిలిచి ఉందంటే అందులో వాన... ఆ వానకు హీరో అక్కినేని, తలకు స్కార్ఫ్ కట్టుకున్న హీరోయిన్ బి.సరోజా కలిసి తడుస్తూ వేసిన స్టెప్సే కారణం.
దేవదాసు క్లయిమాక్స్
పాతరోజుల్లో వానను ఒక క్లయిమాక్స్‌కు వాడి గొప్ప ఫలితాన్ని సాధించిన సినిమా దేవదాసు. ఆ సినిమా క్లయిమాక్స్‌లో పార్వతి ఉన్న ఊళ్లో దిగుతాడు దేవదాసు. జట్కాలు ఉండవు. ఎడ్ల బండి కట్టించుకంటాడు. కాని ఆకాశం మీద మబ్బులు మూసుకొని వస్తాయి. మబ్బులా అవి? కాదు... దేవదాసును కబళించడానికి వస్తున్న మృత్యుమేఘాలు. ఆ వాన... దేవదాసు అనారోగ్యం... ఆ క్లయిమాక్స్ చూసిన ప్రేక్షకుడి మనసును వికలం చేసేస్తాయి. శోభన్‌బాబు ‘బలిపీఠం’ క్లయిమాక్స్ కూడా ఈ వాన వల్లే భీతావహంగా మారుతుంది.
తను చేసిన తప్పును తెలుసుకున్న శారద ఇద్దరు పిల్లలతో అర్ధరాత్రి వానలో భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఇల్లెక్కడో తెలియదు. తీవ్రమైన వాన. తడుస్తున్న పిల్లలు. పైగా తన అనారోగ్యం. ఆ భీతావహ సన్నివేశం చూసేవాళ్లను కరిగి ముద్ద చేసేస్తుంది. తడిసిన బట్టలను ఆరేసుకున్నంత సులభంగా ఆ సన్నివేశాన్నైతే మర్చిపోలేరు. ఎన్టీఆర్ ‘భలే తమ్ముడు’ సినిమాలో కెఆర్ విజయ, ఎన్టీఆర్ వెళుతున్న కారు వానలో ఆగిపోతుంది. కావాలనే ఎన్టీఆర్ ఈ పని చేశాడని కెఆర్ విజయ అనుమానిస్తుంది.
దాంతో పౌరుషంగా కిందకు దిగిన ఎన్టీఆర్ వానలో తడుస్తూ కారు బయట ఉండిపోతాడు. ఈలోపు దొంగలు కెఆర్ విజయ మీద దాడి చేస్తే ఆమెను కాపాడి నిజాయితీని నిరూపించుకుని తద్వారా ప్రేమను గెలుచుకుంటాడు. ఈ సన్నివేశాన్ని కె.రాఘవేంద్రరావు ‘వేటగాడు’లో తిరిగి ఉపయోగించారు. శ్రీదేవి, ఎన్టీఆర్ పాడుకునే సూపర్‌హిట్ పాట ‘ఆకుచాటు పిందె తడిసె’కు ఈ సన్నివేశమే లీడ్.
గాలివానలో వాన నీటిలో...
తర్వాతి తరంలో చిరంజీవి వంటి నటులకు వాన సన్నివేశాల దక్కకపోయినా వాన పాటలు ఎక్కువ తారసపడ్డాయి. ‘ఇంటిగుట్టు’ సినిమాలో ‘లేత లేత చీకటి’ అంటూ నళినితో చిరంజీవి రెయిన్ సాంగ్ పాడుకుంటాడు. ఇదే సమయంలో హిందీలో సూపర్ హిట్ అయిన ‘నమక్ హలాల్’ను తెలుగులో ‘భలే రాముడు’గా రీమేక్ చేస్తే హిందీలో హిట్ అయిన ‘ఆజ్ రపట్ జాయేతో’ను తెలుగులో మోహన్‌బాబు- మాధవి ‘చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టెనే’ అని పాడుకున్నారు. ఇదే మోహన్‌బాబుకు ‘రంగూన్‌రౌడీ’లో ‘వానొచ్చే వరదొచ్చే ఉరకలేక చావొచ్చే’ హిట్ పాట బోనస్‌గా దొరికింది. ఇక శోభన్‌బాబు ‘స్వయంవరం’లో పాడుకున్న ‘గాలివానలో వాన నీటిలో’ పాట ఇప్పటికీ హిట్ పాటగా నిలిచి ఉంది.
నూరవరోజు....
తెలుగు కథలు ఈ ధోరణిలో ఉండగా మరోవైపు తమిళ సినిమాలు వానను ఒక ప్రధాన క్యారెక్టర్‌గా తీసుకోవడం ప్రారంభించాయి. మణివణ్ణన్ దర్శకత్వంలో వచ్చిన ‘నూరవరోజు’ సినిమా ప్రారంభంలోనే వానలో ఒక ముసుగు మనిషి ఒక ఆడపిల్ల శవాన్ని బంగ్లాకు తీసుకొచ్చి గోడలో పెట్టి ప్లాస్టర్ చేసే సీన్‌తో ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ సినిమా క్లయిమాక్స్ కూడా వానలోనే. మణిరత్నం వచ్చి ‘మౌనరాగం’ సినిమాతో ఇదే వానను హీరోయిన్ స్వేచ్ఛా స్వభావాన్ని చూపించాడానికి వాడుకున్నాడు.
అజిత్ నటించిన ‘ఆశ.. ఆశ.. ఆశ’ సినిమా అంతటా వాన ఒక బ్యాక్‌డ్రాప్‌లా ఉంటుంది. ఇక అజిత్, దేవయాని నటించిన ‘ప్రేమలేఖ’ సినిమా క్లయిమాక్స్ అంతా భారీ వర్షం. కేవలం మనసులతో మాత్రమే ప్రేమించుకుని ముఖాలు చూసుకోకుండా ఉన్న ఆ జంటలో హీరోయిన్ హీరో కోసం వానలో వెతుక్కుంటూ తిరిగే సన్నివేశం గొప్పగా పండింది. కన్నడంలో కేవలం వానను ఒక కేరక్టర్‌గా తీసుకుని తీసిన ‘ముంగారు మలె’ సినిమా 80 లక్షల ఖర్చుకు 80 కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించింది.
గొడుగుల హత్య...
1985లో రాహుల్ రావైల్ దర్శకత్వంలో సన్నిడియోల్ హీరోగా వచ్చిన ‘అర్జున్’ సినిమాలో గొడుగుల హత్య సీన్ పెద్ద సంచలనం సృష్టించింది. అందులో సన్నిడియోల్ స్నేహితుడిని గుండాలు వానలో చంపుతారు. భోరున కురిసే వానలో వందలాడి గొడుగులను చీల్చుకుంటూ స్నేహితుడు పరిగెడుతుంటే వెనుక కరవాలాలు పట్టుకుని గూండాలు పరిగెత్తే సన్నివేశం ఆ తర్వాతి కాలంలో ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచింది.
శివ ఫైట్...
రామ్‌గోపాల్ వర్మ వచ్చాక వానను ఒక ఫైట్‌కు రోమాంచితం చేయడానికి ఉపయోగించడం ‘శివ’లో కనిపిస్తుంది. శివ గ్యాంగు మీద భవానీ గ్యాంగ్ అటాక్ చేయాలని వచ్చినప్పుడు అర్ధరాత్రి రెండు టీములూ ఎదురూ బొదురూ వచ్చాక హటాత్తుగా వాన మొదలవుతుంది. ఆ సన్నివేశం తర్వాతే శివ తడిసిన బట్టల్లో ఒక గూండాను భుజాన వేసుకొని భవానీ ఇంటికి వెళతాడు. ‘క్షణక్షణం’లో అడవిలో వాన పడుతుంటే వెంకటేశ్, శ్రీదేవిలతో పరేశ్ రావెల్ వానకు తడవ్వొద్దని సలహా ఇస్తూనే ‘నేను వంద రూపాయలకు కూడా మర్డర్ చేసిన రోజులున్నాయి’ అని చెప్పడం ప్రేక్షకులు మర్చిపోలేరు. తర్వాతి కాలంలో ‘మనసంతా నువ్వే’లో ప్రేమలో విఫలమైన ఉదయ్ కిరణ్‌ని ‘వాన వెలిసే లోపల మనసారా ఏడ్వరా... ఎవరికీ తెలీదు’ అని సునీల్ చెప్పే సన్నివేశం చాలామందికి నచ్చింది. ఇక ‘వర్షం’ సినిమాకు మూలమే వర్షం. వానలో తడుస్తూ పాడుతున్న త్రిషను విలన్ గోపిచంద్ మొదటిసారిగా చూడకపోతే కథే లేదు.
జులాయి... లాయి...
ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో వానను ఎఫెక్టివ్‌గా వాడుకున్న సినిమా ‘జులాయి’. ఈ సినిమా మొదలే వానతో మొదలై బ్రహ్మాండమైన మూడ్‌ని సెట్ చేస్తుంది. ఇటీవలి సినిమాలు అనేకం వానను ఉపయోగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సినిమా ఉన్నంత కాలం వాన ఉంటుంది. లేదా వాన ఉన్నంత కాలంలో సినిమాలో అది కురుస్తుంది.బయట వానగా ఉందా? అయితే మంచి సినిమాకెళ్లి కూచుంటే పోలా?
- సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి