‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అసలు కథ ఇదిగో | Rajamouli Pressmeet About RRR Movie | Sakshi
Sakshi News home page

చరణ్‌ @సీతారామరాజు.. ఎన్టీఆర్‌ @కొమరం భీమ్‌

Published Fri, Mar 15 2019 12:19 AM | Last Updated on Fri, Mar 15 2019 9:59 AM

Rajamouli Pressmeet About RRR Movie - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ లుక్‌

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’... రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌... వీరు ముగ్గురూ కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ నెలకొంది. ఈ  కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ చేయగానే కథేంటి? హీరోల పాత్రలేంటి? సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ని రాజమౌళి ఎలా సంతృప్తిపరచనున్నారు? అనే చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు చెప్పారు హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, డైరెక్టర్‌ రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య. అలాగే పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

రాజమౌళి మాట్లాడుతూ ‘‘జనరల్‌గా సినిమా షూటింగ్‌ మొదలు పెట్టకముందే కథ చెబుతాను. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకి చెప్పలేకపోయా. అయినా ఇంకా బిగినింగ్‌ స్టేజ్‌లోనే ఉన్నాం.. అందుకే ఈ రోజు చెబుతున్నాం.

► 1897లో ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. అది అందరికీ తెలిసినదే. ఆయన ఇంగ్లీష్‌ చదువులే కాకుండా వేదాలు, పురాణాల్లోని ఇతిహాసాలన్నీ బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు మూడేళ్లు ఇంటివద్ద లేరు. ఎక్కడికెళ్లారు? ఏం చేశారు? అన్నది ఎవరికీ తెలియదు. తిరిగొచ్చాక ఆయన ఆదివాసీల హక్కుల కోసం స్వాతంత్య్ర ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి బ్రిటీష్‌వారి చేతుల్లో చనిపోయేవరకూ అల్లూరి ప్రయాణమంతా మనకు తెలిసిన కథే.

► 1901లో అంటే.. అల్లూరి పుట్టిన రెండు మూడేళ్లకు ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరం భీమ్‌ పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. ఆయన వెళ్లిపోయేటప్పుడు నిరక్షరాస్యుడు.. కానీ చదువుకున్న వ్యక్తిగా తిరిగొచ్చా. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులకోసం, వారి స్వాతంత్య్రం కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమరం భీమ్‌ కూడా పోరాడారు. చివరికి బ్రిటీష్‌ వారి చేతుల్లో చనిపోయారు. ఇద్దరి చరిత్ర చదువుతున్నప్పుడు ఒకేటైమ్‌లో పుట్టడం.. ఒకేటైమ్‌లో వెళ్లిపోవడం... వెళ్లాక ఏం జరిగిందనేది తెలియకపోవడం? తిరిగొచ్చాక ఒకేవిధానంలో పోరాటం చేయడమన్నది నాకు చాలా ఆసక్తిగా, ఎగై్జటింగ్‌గా అనిపించింది.

ఆ విషయాలనే మా  సినిమాలో కథగా చూపించబోతున్నాం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు.. చరిత్రలో ఎప్పుడూ కలవనివాళ్లు.. ఒకరికొకరు సంబంధంలేని వీరులు... నిజంగా మనకు తెలియని టైమ్‌లో వారిద్దరూ కలిసి ఉంటే, ఒకరికొకరు స్ఫూర్తి అయ్యుంటే.. తర్వాతి కాలంలో వారు బ్రిటీష్‌వారిపై, నిజాం ప్రభుత్వంపై పోరాడుతున్నప్పుడు వారి మధ్య స్నేహం ఏర్పడి ఉండుంటే ఎలా ఉండేది? అన్నది నాకు చాలా ఎగై్జటింగ్‌గా, ఆసక్తిగా అనిపించింది. ఇప్పటి వరకూ మనకు తెలిసిన స్టోరీ ఈ చిత్రంలో చెప్పడం లేదు. పూర్తిగా తెలియని కథ బిగ్‌ ప్లాట్‌ఫామ్‌లో చెబుతున్నాం. 1920 ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కథ కాబట్టి ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేయాల్సి వచ్చింది.

► ఇలాంటి కథకు, ఇంతపెద్ద హీరోలు ఉన్న స్టోరీకి సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. అజయ్‌ దేవగణ్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో పవర్‌ఫుల్‌ పాత్ర చేస్తున్నారు. కథ చెప్పగానే ఎగై్జట్‌ అయ్యి డేట్స్‌ ఎప్పుడు కావాలని అడిగారాయన. చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తారు. బాంబే నుంచి వస్తుంటే అనుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం. రఫ్‌గా కథ చెప్పి, నిన్ను అనుకుంటున్నాం అనగానే ‘ఏ పాత్రైనా చేస్తాను’ అన్నారు. తారక్‌కు జోడీగా విదేశీ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ చేస్తున్నారు. సముద్రఖని కూడా మంచి పాత్ర చేస్తున్నారు.

► ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అని వర్కింగ్‌ టైటిల్‌ అనుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాన్స్‌ నుంచి అదే బాగుంది.. దాన్నే టైటిల్‌గా పెట్టండి’ అంటూ ఒత్తిడి వచ్చింది. అన్ని భాషల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే కామన్‌ టైటిల్‌తోనే విడుదల అవుతుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో అర్థంతో విభిన్నమైన టైటిల్‌ ఉంటుంది. అయితే ఆ టైటిల్‌ ఏంటనేది అభిమానులనే గెస్‌ చేయమంటున్నాం. ఈ చిత్రంలో యువకుడిగా ఉన్నప్పటి సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్, యంగర్‌ కొమరం భీం పాత్రను తారక్‌ చేస్తున్నారు’’ అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘ఎప్పటినుంచో రాజమౌళిగారితో మళ్లీ పని చేయాలనుకోవడం.. నా బెస్ట్‌ఫ్రెండ్, నాకు బాగా దగ్గరైన వ్యక్తి, చాలా చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో కలిసి, మాకు తెలిసిన దానయ్యగారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం ఒకరోజు ఊరు వెళ్తున్నప్పుడు రాజమౌళిగారు ఓసారి ఇంటికి వచ్చి వెళ్లు అంటే వెళ్లాను. ఆయన ఇంట్లోకి వెళ్లగానే నేలపై కూర్చుని రిలాక్స్‌ అవుతున్న తారక్‌ కనిపించారు. అక్కడికి తారక్‌ వస్తాడని నాకు. నేను వస్తానని తారక్‌కి తెలియదు. ఇద్దరం కన్‌ఫ్యూజ్‌ అయ్యాం. అప్పుడు రాజమౌళిగారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి చెప్పడంతో ఇద్దరం ఆయన్ను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పాం. ఆ తర్వాత మేం ముగ్గురం కలిసి సోఫాలో కూర్చుని తీసిన ఫొటోనే మీరు చూశారు. మరచిపోలేని, గౌరవప్రదమైన, బాధ్యతతో కూడిన పాత్రల్లో నటిస్తున్నాం. ఇదొక ఫిక్షనల్‌ స్టోరీ. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం.  మా ఇద్దరి కాంబినేషన్‌లో (చరణ్, ఎన్టీఆర్‌) వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. ఇంకా మా పాత్రల చిత్రీకరణ మొదలు కాలేదు’’అన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘జక్కన్న (రాజమౌళి)తో నాకిది నాలుగో చిత్రం. అన్నింటికంటే ఈ చిత్రం చాలా ప్రత్యేకమైనదిగా నా కెరీర్‌లో మిగిలిపోతుంది. ఎందుకంటే.. జక్కన్నతో పనిచేయడం, దాంతోపాటు చరణ్‌తో కలిసి తెర పంచుకోవడం.. మా ఇద్దరి స్నేహం (చరణ్‌–ఎన్టీఆర్‌) ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు మంచి మిత్రుడు.. నా కష్ట సుఖాలు పంచుకునే స్నేహితుడు చరణ్‌. ఈ సినిమాకు మేం కలిసేసరికి మా స్నేహం వేరే లెవల్‌కు వెళ్లిపోయింది. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా. ఎందుకంటే.. మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెబుతుంటుంది. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు. ఇక సినిమా విషయానికొస్తే... అల్లూరి, కొమరం భీం గురించి మనకు తెలిసిన గీత ఒకటి ఉంది.

ఇప్పుడు వారిద్దరి గురించి మనకు తెలీని కోణం, వారిద్దరూ కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది? అనే కన్‌క్లూజన్‌ దర్శకుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోకి తీసుకురావడం నటులుగా మాకు కొత్తగా అయిపోయింది. ఒక నటుడికి ఎంత ఇన్ఫర్మేషన్‌ తక్కువ ఉంటే అంత తన ఎఫర్ట్‌ బయటికొస్తుందని నమ్మే వ్యక్తిని నేను. ఈ చిత్రం నాకు, చరణ్‌కి నటులుగా ఎదగడానికి  దోహదపడుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ భవిష్యత్‌ సినిమాలకు సహాయపడుతుంది. జక్కన్న బుర్రలో పుట్టిన ఈ ఆలోచన 101 శాతం ఓ గొప్ప చిత్రంగా నిలబడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ చిత్రానికి ఆయన అడగ్గానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, భేషజాలు లేకుండా స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఒప్పుకొన్నందుకు చరణ్‌కి హ్యాట్సాఫ్‌. మా తరంలో ఈ సినిమా రాబోతున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు.

డీవీవీ దానయ్య మాట్లాడుతూ ‘‘భారతదేశం గర్వించే దర్శకుడు రాజమౌళిగారితో ఈ సినిమాను తెరకెక్కించడం నా పూర్వజన్మ సుకృతమో, నా అదృష్టమో.. ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. రెండు పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన, ఇద్దరు సమ ఉజ్జీలు (చరణ్, ఎన్టీఆర్‌)లతో ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని 2020 జులై 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.. ఇలా 10 భారతీయ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

వివాదాలు వస్తాయని మానేయాలా?
– రాజమౌళి
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ బ్రహ్మచారులు. వారి జీవితాల్లో పెద్దగా రొమాన్స్‌ లేదు. ఇందులో ఒక బాలీవుడ్, ఒక హాలీవుడ్‌ హీరోయిన్‌ ఉన్నారు?
చరిత్రలో కొమరం భీమ్‌కి ఇద్దరు భార్యలు. అల్లూరి సీతారామరాజుకి సీత అనే మరదలు ఉంది. సీతతో రామరాజు వివాహం జరగలేదు కానీ ఇద్దరి మధ్య రొమాన్స్‌ ఉండేది. నేను తెలిసిన కథ చెప్పడం లేదు. తెలియని కథ చెబుతున్నాను.

రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌తో ఈ సినిమా కథ కల్పితమా? సహజ కథేనా?
రియల్‌ క్యారెక్టర్స్‌తో తీస్తున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరభారతదేశం (నటీనటులు, కథని ఉద్దేశించి) ఇలా దేశం మొత్తాన్ని కనెక్ట్‌ చేశారు! అనుకుని చేసింది కాదు. తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు, ఆంధ్ర నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు. వారిద్దరి మధ్య స్నేహం అనేది ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత తెలిసింది. వారిద్దరూ వేరే వేరు ప్రాంతాల నుంచి వచ్చారని. బ్రహ్మాండంగా ఉంటుందనిపించింది. ఈ ప్రశ్న తర్వాత ఉత్తర భారతదేశాన్ని కూడా కనెక్ట్‌ చేశానని నాకూ అనిపిస్తోంది.

ప్రీ– ఇండిపెండెన్స్‌ నేపథ్యంలోనే ఉంటుందా? లేక కథ ఈ తరంలో కూడా జరుగుతుందా?
కథ అంతా 1920 నేపథ్యంలోనే ఉంటుంది.

మేలో ఎన్టీఆర్‌ బర్త్‌డే. మార్చిలో రామ్‌చరణ్‌ బర్త్‌డే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని లుక్స్‌ను రిలీజ్‌ చేస్తారా?
సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తున్నాం. ఇప్పుడే లుక్స్‌ రిలీజ్‌ చేయడం చాలా ఎర్లీ అవుతుంది. ఎన్టీఆర్‌ కల్పించుకుంటూ... 2020 లో కూడా ఓ మే, ఓ మార్చి ఉంది (నవ్వు).

స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా సినిమా తీస్తూ కాస్త స్వేచ్ఛ తీసుకుంటున్నారు. వివాదాలు రావొచ్చు. మీకు ఎలా అనిపిస్తోంది?
ఏ సినిమాని అయినా ఇదే తొలి సినిమా అనుకుని చేస్తుంటాను. ఇంతకుముందు నా సినిమాలు హిట్‌ అయ్యాయి. ఆ అంచనాలు ఉంటాయి ప్రేక్షకుల్లో. నా జడ్జ్‌మెంట్‌ కోసం సిన్సియర్‌గా వర్క్‌ చేస్తాను. వివాదాలు వస్తూనే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా తీసిన ‘బాహుబలి’ సినిమాకే వివాదాలు వచ్చాయి. ఇప్పుడు వివాదాలు రావడం కామన్‌ అయిపోయింది.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఎవరికీ తెలియని సంఘటనలు చూపిస్తాం అంటున్నారు. కంప్లీట్‌ ఫిక్షన్‌గా వెళ్తున్నారా? లేక ఏదైనా పరిశోధన జరుగుతుందా?
సినిమా స్టార్ట్‌ చేయకముందు వారిద్దరి గురించి పూర్తిగా చదివాం. ధ్రువీకరించి రాసిన నవలల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. స్పష్టమైన సమాచారం ఏం లేదు. ఉండి ఉంటే నేను వర్రీ కావాల్సి వచ్చేది. లేదు కాబట్టి ఫ్రీడమ్‌ వచ్చినట్లైంది. కథను ఎలా కావాలంటే అలా ప్రెజెంట్‌ చేసే అవకాశం వచ్చింది. పూర్తిగా కల్పిత గాథ.

చరిత్రలో వీరులగాథలు కరెక్ట్‌గా ఉండాలి. అందుకోసం మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
నేను మామూలుగా మన హీరోలనూ సూపర్‌ హ్యూమన్‌గా చూపించి నిలబెడతాను. అలాంటిది ఇద్దరు రియల్‌ సూపర్‌ హీరోస్‌ని ఎలాంటి స్థాయిలో ఉంచుతానో ఆలోచించుకోండి. కృష్ణగారు ‘అల్లూరి సీతరామరాజు’  తీసినప్పుడు వివాదాలు వచ్చాయి. అలాగని ఆయన మానేయ్యాలా? ‘అన్నమయ్య’ తీసినప్పుడు వివాదాలు వినిపించాయి. మానేయాలా? వివాదాలు వచ్చాయని భయపడి మనం నమ్మిన ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని తీయడం మానకూడదని నా నమ్మకం.

హీరోల స్క్రీన్‌ టైమ్‌ ఎలా ఉంటుంది?
టాప్‌ స్టార్‌డమ్‌ ఉన్న ఇద్దరు హీరోలు సినిమాలో నటిస్తున్నప్పుడు... కొంచెం అటు ఇటు అయితే అభిమానులు నొచ్చుకుంటారని ఒకరికి ఒక ఫైట్, ఇంకొకరికి ఇంకో ఫైట్, ఒక సాంగ్‌ పెడితే ఇంకో సాంగ్, ఫైట్‌లో ఒక పంచ్‌ పెడితే.. ఇంకొకరికి ఇంకో పంచ్‌. ఇలా పంచుకుంటూ పోతే... కథలో రసం అనేది పోతుంది. ఒక ఫిల్మ్‌మేకర్‌గా స్టోరీ స్ట్రాంగ్‌గా ఉందా? లేదా? అని చూసుకుంటాను. ఆడియన్స్‌ సినిమా చూడ్డానికి థియేటర్స్‌కి వచ్చి.. చరణ్‌ని, తారక్‌ని చూడటం మర్చిపోయి తెరపై చూపించిన క్యారెక్టర్స్‌ను చూడగలరా? లేదా అన్న విషయంపై పెద్ద కసరత్తు చేశాం. మాకు ఆత్మవిశ్వాసం వచ్చి, ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్‌ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్‌ స్క్రీన్‌ ప్లే అండ్‌ స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మాక ముందుకు వెళ్లాలి. నేను నమ్మి వెళ్తున్నాను. బ్యాలెన్స్‌ ఉండాలి. ఆడియన్స్‌ క్యారెక్టర్స్‌ను హత్తుకునే దగ్గర బ్యాలెన్స్‌ ఉండాలి. ఒకరిని ఎక్కువ ఇష్టపడేలా, మరొకరిని తక్కువ ఇష్టపడేలా చేస్తే అది అన్‌బ్యాలెన్స్‌డ్‌ స్టోరీ అవుతుంది. సినిమా కంప్లీట్‌ అయ్యేసరికి కొమరం భీమ్‌ పాత్రలో ఆడియన్స్‌కు తారక్‌ ఎంతబాగా నచ్చుతారో,  అల్లూరి పాత్రలో చరణ్‌ కూడా అంతే బాగా నచ్చుతారు.

1920లో సినిమా నేపథ్యం. 2020లో సినిమా విడుదల. సరిగ్గా శతాబ్దం. కావాలని ప్లాన్‌ చేశారా?
కథ చూసుకుంటే 1920, 21లో ఉంటుంది. 2020, 2021 వరకు సినిమా వెళ్లదు. కచ్చితంగా 2020లోనే విడుదల అవుతుంది.

మీ సినిమాకు సంబంధించి ఫలానా సీన్‌ కాపీ, ఫలానా పోస్టర్‌ కాపీ అనే మాటలు వినిపిస్తుంటాయి? ఈ సినిమాతో వాటికి బ్రేక్‌ వేస్తారా?
రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఎక్కడెక్కడో వెతికి తెలియని దాన్ని కూడా తెచ్చి పెడుతుంటారు. అది ఫిల్మ్‌మేకింగ్‌లో ఓ పార్ట్‌. దానిగురించి ఒక్క సెకను కూడా ఆలోచించను.

జాతీయ స్థాయిలో మన ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ కథ ఇతర భాషల వారికి కూడా రీచ్‌ అవుతుందా? అని ఏమైనా ఆలోచిస్తున్నారా?
గొప్ప గొప్ప వీరుల కథలు అందరికీ తెలియాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఇద్దరు తెలుగు వీరుల గురించి చెబుతున్నారట కదా? అని మిగతావారు గూగుల్‌ చేసినప్పుడు హ్యాపీ ఫీల్‌ అవుతాను.

ఇద్దరు యోధులు వీరమరణం పొందారు. సినిమా ఎలా ఎండ్‌ అవుతుంది? సీక్వెల్‌ ఏదైనా?
వారు తిరిగి వచ్చి స్వాతంత్య్ర పోరాటం స్టార్ట్‌ చేసే నేపథ్యంలో మనకు తెలిసిన అన్ని కథలు ఉన్నాయి. కానీ నా కథ వారు తిరిగి రావడంతో అయిపోతుంది. ఏ విధంగా వారు మనకు తెలిసిన లెజెండ్స్‌గా మారారు అనే దానితో ఈ కథ ముగుస్తుంది. వారు వీరమరణం పొందటం. ఆంధ్రా, తెలంగాణకు వచ్చి వారు ఏ విధంగా పోరాడారు అన్నది నా కథలో భాగం కాదు. నిడివి ఎక్కువగా ఉండటం వల్లే ‘బాహుబలి’ సినిమాను రెండు పార్టులుగా తీశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒక సినిమానే.

ఈ సినిమా ఆలోచన ఎవరది?
నాదే. చాలా ఏళ్ల క్రితం ‘మోటర్‌ సైకిల్‌ డైరీస్‌’ సినిమా చూశాను. సినిమాలో షే అనే వ్యక్తి గురించి కథ సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ ఉంటుంది. చాలా బాగుంది. రాజు అనే కుర్రాడి గురించి చెప్పి, అతనే తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. అలాగే అల్లూరి, కొమరం భీమ్‌ ఇద్దరు ఇంచుమించు ఒకే కాలానికి చెందినవారు కావడం, ఒకేసారి ఎక్కడికో వెళ్లిపోవడం, తిరిగొచ్చిన తర్వాత ఇద్దరు గెరిల్లా వార్‌లా ఫైట్‌ చేయడం... ఇది అద్భుతమైన ఆలోచన అనిపించింది. అలా ఈ సినిమా వచ్చింది.

అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్‌పై, కొమరం భీమ్‌ ముస్లిం నేపథ్యం ఉన్నవారిపై ఫైట్‌ చేశారు. మీరు ఈ కథను అనుకున్నప్పుడే ఏమీ ఉండకపోవచ్చు. రేపు మీరు ఈ కథను రిలీజ్‌కు రెడీ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్‌ వచ్చే అవకాశం ఉందా?
ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్‌ (నవ్వులు). కొమరం భీమ్‌ నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు కథ చెప్పడం మానేయాలా? చెప్పకూడదా?  ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. నేను పెద్దగా పట్టించుకోను. కథను ఎంత బలంగా, నిజాయతీగా చెబుతున్నామన్నదే ముఖ్యం మనకు.

అల్లూరి పాత్రలో కృష్ణగారు నటించారు. ఈ సినిమాలో ఆ పాత్రకు మహేశ్‌బాబు గుర్తుకు రాలేదా?
ఒక ఫంక్షన్‌లో మహేశ్‌బాబుతో మీ సినిమా ఎప్పుడు అని ఫ్యాన్స్‌ అడిగితే.. మహేశ్‌బాబును ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారని అడిగాను. అల్లూరి సీతరామరాజు అన్నప్పుడు అంత స్పందన రాలేదు వారి దగ్గర్నుంచి. జేమ్స్‌బాండ్‌గా చూడాలనుకుంటున్నారా? అంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. అదే సమాధానం.

ఏ హీరో పేరు టైటిల్‌ ముందు పడుతుంది స్క్రీన్‌పై?
సినిమాలో ఫస్ట్‌ ఎవరు కనిపిస్తే వారిది వస్తుంది. ‘ఇన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ కాస్ట్‌. ఇన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ అప్పియరెన్స్‌’. ఇంగ్లీష్‌వారికి కూడా ఆ ప్రాబ్లమ్‌ వచ్చి అది కనిపెట్టారు.

 మీరు ఎంత బిజినెస్‌ అయినా చేసి ఉండొచ్చు. 2020 జూలై వరకు ఎన్టీఆర్, తారక్‌లను బ్లాక్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్‌?
ఎన్టీఆర్, తారక్‌లు మధ్యలో ఒక సినిమా చేసినా ఆ సినిమాకన్నా ఈ ఒక్క సినిమాకు వారు చేసే వర్కింగ్‌ డేస్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క సినిమాతోనే చాలామందికి లైవ్లీహుడ్‌ లభిస్తోంది. మోర్‌ వర్క్‌ జనరేట్‌ అవుతోంది. ఈ యాంగిల్‌లో చూస్తే ఇది బెటర్‌.

అంటే ఫ్యాన్స్‌కి ఇద్దర్నీ ఏడాదిలో రెండు  సినిమాలు చూడాలనే కోరిక ఉంటుంది కదా?
చరణ్‌ మాట్లాడుతూ– ఈ మధ్య ఏ సినిమా ఏడాది లోపు కావడం లేదు. ఈయన ఏడాది లోపు వదిలేస్తున్నారు.. వదిలేస్తున్నారుగా రాజమౌళి వైపు చూస్తూ.. (నవ్వులు). ఏ ప్రొడ్యూసర్‌కి అయినా, ఏ డైరెక్టర్‌కి అయినా, ఏ హీరోకైనా రాజమౌళిగారితో ఓ సినిమా చేస్తే అది ఓ పదేళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూ పరంగా.. ఓ 5–10 ఇయర్స్‌ వరకు ఆ సినిమా రెవెన్యూను కొట్టడానికి లేకుండా ఉంటుంది. ఏం చేసినా అది ఇన్టు త్రీ, ఇన్టు ఫోర్‌ అవుతుంది. అలాగే వర్క్‌వైజ్‌గా చాలామందికి లైవ్లీహుడ్‌ దొరుకుంది. మాకు కంగారు లేదు. ఎన్ని రోజులు తీసినా ఓకే.
తారక్‌ కల్పించుకుంటూ... మాకు ఎడ్యుకేషన్‌ హాలీడేలా ఉంటుంది. కంగారుగా సినిమాలు చేయకుండా... కొత్తకొత్తగా ఏం చేయాలో నేర్చుకుంటున్నాం.

‘మహాభారతం’ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది? అది ఏ స్టేజ్‌లో ఉంది?
‘మహాభారతం’ నా డ్రీమ్‌ప్రాజెక్ట్‌ అని చెప్పాను. అది నా లాస్ట్‌ సినిమా కావొచ్చు. అది సిరీస్‌లా వస్తుంది.

రాజమౌళిగారు కాకుండా ఏ దర్శకుడైనా అప్రోచ్‌ అయితే ఈ మల్టీస్టారర్‌ వర్కౌట్‌ అయ్యేదా?
ఎన్టీఆర్‌: ఇంకో దర్శకుడు అప్రోచ్‌ అయ్యుంటే జరిగి ఉండేదా? అంటే అది భవిష్యత్‌. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను. రాజమౌళి కాబట్టే ఇది జరిగింది.

వందకోట్లు ఇస్తాం.. ఈ సినిమాను వదులుకోమని మీకు ఆఫర్‌ వచ్చింది? అయినా మీరు ఈ సినిమాను ఎందుకు వదులుకోలేదు?
దానయ్య: వచ్చింది. రాజమౌళిగారితో ఎప్పట్నుంచో ట్రావెల్‌ అవుతున్నాను. ఆయనతో సినిమా చేయాలని నా కోరిక. ఈ సినిమా బడ్జెట్‌ 350 టు 400 కోట్లు.

మీరు అల్లూరి పాత్రలో, మీ నాన్నగారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో.. ఇలా ఒకేసారి స్వాతంత్య్ర సమరయోధుల సినిమాలు చేయడం ఎలా ఉంది?
చరణ్‌: అస్సలు అనుకోలేదు. ఈ ఏడాది సెకండాఫ్‌లో నాన్నగారి ‘సైరా’ విడుదల కాబోతుండటం. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నేను చేస్తుండటం కాకతాళీయం.

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో రాయలసీమ మాండలికం పలికారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో తెలంగాణ మాండలికం నేర్చుకుంటున్నారా?
ఎన్టీఆర్‌: కొమరం భీమ్‌గారి మాండలికం ఏదైతే నా మాండలికం అదే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంపాక్ట్‌ ఎలా ఉంటుంది?
ఎన్టీఆర్‌: దేశవ్యాప్తంగా తెలుగు హీరోలు (అల్లూరి, కొమరంభీమ్‌)ల గురించి చాటిచెప్పేలా ఈ సినిమా ఇంపాక్ట్‌ ఉంటుంది.


డీవీవీ దానయ్య, ఎన్టీఆర్, రాజమౌళి, రామ్‌చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement