రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..!
రాజమౌళి, తెలుగు సినీ రంగంలో ఓ బ్రాండ్. ప్రాంతీయ సినిమా మార్కెట్ పరిథులను చెరిపేసి రీజినల్ సినిమా కూడా జాతీయ స్థాయి సినిమాలతో పోటి పడగలదని ప్రూవ్ చేసిన దర్శకుడు. ఆర్థిక వనరులు అనుకూలించాలే గాని హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగల సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని ప్రూవ్ చేసిన దర్శకుడు. అలాంటి రాజమౌళిని శ్రీవల్లి ఆడియో ఫంక్షన్లో చూసిన వారు అవాక్కయ్యారు.
రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి చిత్రాల కథా రచయిత అయిన.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీవల్లి. రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకకు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో జరిగిన ఓ సంఘటన రాజమౌళి స్థాయిని అభిమానుల హృదయాల్లో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
ఆడియో వేడుక జరుగుతుండగా వేదిక మీద ఉన్న విజయేంద్ర ప్రసాద్ షూ లేస్ ఊడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాజమౌళి వెంటనే స్వయంగా ఆయనే కింద కూర్చొని తండ్రి షూ లేస్ను కట్టారు. జాతీయ స్థాయిలో భారీ ఇమేజ్ ఉన్న దర్శకుడిని అలా చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎన్ని విజయాలు సాధించిన రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..!