
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దర్బార్’ చిత్రబృందంపై దాడి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఓ కాలేజ్‌లో జరుగుతుంది. ఈక్రమంలో సదరు కాలేజ్ స్టూడెంట్స్ షూటింగ్ స్పాట్‌వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల భవనం మీదకు వెళ్లి.. చిత్రబృందంపై రాళ్ల దాడి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మురగదాస్ ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడమే కాక లోకేషన్ చేంజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. అయితే ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాపై లీకు వీరులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్‌లోకి విజిటర్స్ రాకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలో కాలేజ్ విద్యార్థులను కూడా అనుమతించకపోవడంతో.. వారు ఇలా దాడికి పాల్పడినట్లు సమాచారం.