
తమిళ సినిమా: సూపర్‌స్టార్ ఈ ఒక్క పేరు చాలు అభిమానులు సంతోషంలో మునిగితేలడానికి. అవును రజినీకాంత్ అభిమానులకు సూపర్‌స్టార్ అన్నది ప్రాణవాయువు లాంటిదేనని చెప్పవచ్చు. తలైవా (నాయకుడు) అన్నది ఆ తరువాతనే. అందుకే సూపర్‌స్టార్ పట్టాన్ని అంత సులభంగా వదులుకోవడానికి రజనీకాంత్ సిద్ధంగా లేరని చెప్పవచ్చు. సినిమాలకు దూరమై రాజకీయల్లోకి ప్రవేశిస్తే సూపర్‌స్టార్ పట్టాన్ని మరో హీరో తన్నుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారనిపిస్తోంది. ఈయన ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. చిత్ర మోషన్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు.
తమిళ వెర్షన్‌ను రజనీకాంత్ మిత్రుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ఆన్‌లైన్‌లో ఆవిష్కరించగా, హిందీ వెర్షన్‌ను సల్మాన్‌ఖాన్, తెలుగు వెర్షన్‌ను మహేశ్‌బాబు, మలయాళ వెర్షన్‌ను మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు ఆవిష్కరించి సూపర్ పబ్లిసిటీని అందించారు. చాలా కాలం తరువాత ఆయన పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం దర్బార్. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రజనీకాంత్‌కు డిసెంబర్ 12న పుట్టిన రోజు. అది అభిమానులకు పండుగరోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతకు ముందు అంటే డిసెంబర్ 7న వారికి మరో పండుగరోజు కాబోతోంది. అవును ఆ రోజున దర్బార్ చిత్ర ఆడియో ఆష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ వేడుకను చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అయితే చిత్ర కథానాయకి నయనతార ఇందులో పాల్గొంటుందా అన్నది ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment