
తమిళసినిమా: ఇటీవల రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న అభిమానికి నటుడు రజనీకాంత్ ఆర్థిక సాయం అందించారు. వివరాలు.. మధురై, తిరునగర్‌కు చెందిన కాశీవిశ్వనాథన్(32) వివాహితుడు. రజనీకాంత్ అభిమాని. అతను ఈనెల 9న చెన్నైలో జరిగిన కాలా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చాడు. తిరిగి రైలులో ప్రయణిస్తుండగా తలుపు వద్ద కూర్చుని ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో అతని ఒక కాలు రైలు చక్రంలో ఇరుక్కుని నలిగిపోయింది. వెంటనే అతడిని చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రమాదానికి గురికావడంతో డాక్టర్లు ఆతని రెండో కాలు కూడా తొలగించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈ విషయం రజనీకాంత్ దృష్టికి రాగా.. తన ప్రజా సంఘ నిర్వాహకుడు సుధాకర్‌ని తన తరఫున కాశీవిశ్వనాథన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పంపారు. సుధాకర్ కాశీవిశ్వనాథన్ భార్య, తల్లిదండ్రులను మంగళవారం కలిసి పరామర్శించారు. వారికి రజనీకాంత్ తరఫున ఆర్థిక సాయం అందించారు. ఎటువంటి సహాయం కావాల్సినా వెంటనే ఫోన్ చేయమని వారికి తెలిపారు.