
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ లింగ?
ఎవరెస్ట్ అంత ఇమేజ్ ఉన్న హీరో రజనీకాంత్. ‘నరసింహ’ చిత్రంలో ఆ స్థాయిలో ఆయన పాత్రను ఆవిష్కరించారు దర్శకుడు కేఎస్ రవికుమార్. తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ వారిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతుండటం రజనీ అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకునికి కూడా ఆనందం కలిగించే వార్తే. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క కథానాయికలుగా నటించనున్నారు. అయితే... ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో రజనీకాంత్ స్వాతంత్య్ర సమరయోధునిగా, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట.
ఇదిలావుంటే... ఈ సినిమాకు ‘లింగ’ అనే టైటిల్ బావుంటుందని రజనీ, కేఎస్ రవికుమార్ అనుకుంటున్నారట. స్వతహాగా రజనీ శివభక్తుడు. పైగా ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరు ‘లింగ’. కథ రీత్యా కూడా ఆ పేరు కరెక్ట్‌గా సరిపోతుందని రజనీ, కేఎస్‌లు భావించారట. అందుకే... ‘లింగ’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కొలవరి’ఫేం అనిరుథ్ సంగీతం అందించనున్నట్లు వినికిడి. మాస్ ప్రేక్షకులకు మెచ్చేలా ఇందులో రజనీ పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. ‘రోబో’కి ఛాయాగ్రహణం అందించిన రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు.