రజనీకాంత్ నటిస్తున్న లింగా చిత్రం పూజా కార్యక్రమం మైసూరు చాంముండేశ్వరి ఆలయంలో శుక్రవారం జరిగింది. రజనీ యానిమేషన్ చిత్రం అయిన కోచ్చడయాన్ ఈ నెల తొమ్మిదో తేదీ విడుదల కానుంది.
రజనీకాంత్ నటిస్తున్న లింగా చిత్రం పూజా కార్యక్రమం మైసూరు చాంముండేశ్వరి ఆలయంలో శుక్రవారం జరిగింది. రజనీ యానిమేషన్ చిత్రం అయిన కోచ్చడయాన్ ఈ నెల తొమ్మిదో తేదీ విడుదల కానుంది. ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మరో చిత్రంలో కొత్త గెటప్‌లో రజనీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి లింగా అనే పేరును పెట్టారు. రజనీ పరమ శివ భక్తుడు. ఇది వరకే అన్నామలై, అరుణాచలం అనే శివుని పేర్లతో తీసిన చిత్రాల్లో నటించారు. ఇవన్నీ విజయం సాధించారుు. ప్రస్తుతం కొత్త చిత్రానికి లింగా అనే పేరును సూచించడం ఆయనకు ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం షూటింగ్ మైసూర్‌లో 45 రోజుల పాటు జరగనుంది. ఇందు కోసం అక్కడ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం రజనీ, లింగా చిత్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మైసూర్‌లో గల చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. రజనీ ఈ చిత్రం కోసం ప్రత్యేక గెటప్‌లో అక్కడికి చేరుకున్నారు. రజనీ స్నేహితుడైన కన్నడ నటుడు అంబరీశ్, ఆయన సతీమణి నటి సుమలత అక్కడికి వచ్చారు. చాముండేశ్వరి అమ్మవారి ముందు క్లిప్పింగ్ బోర్డు, స్క్రీన్ ప్లే పుస్తకాన్ని ఉంచి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రజనీకి డెరైక్టర్ కె.ఎస్.రవికుమార్‌కు అంబరీశ్ పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో రజనీ కాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలిసింది. లింగా చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, సోనాక్షి సిన్హాలు ఎంపికైన విషయం తెలిసిందే. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.రత్నవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు.