
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 2.ఓ చిత్రం ఒకటి. స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ రూ.400కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను కట్టిన ఈ చిత్ర ఆడియో ఇటీవల దుబాయిలో బ్రహ్మండంగా నిర్వహించారు. 2.ఓ చిత్రాన్ని శంకర్ 3డీ ఫార్మాట్‌లో తెరెక్కిస్తున్నారు. రజనీ అభిమానులైతే చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా 2.ఓ చిత్రాన్ని నిర్మాతలు మొదట దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో రజనీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న తెరపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అప్పుటికీ గ్రాఫిక్స్ వర్క్ మిగిలిపోవడంతో జనవరిలో విడుదల గ్యారెంటీ అని నిర్వాహకుడు రాజు మురుగన్ నొక్కి వక్కాణించారు. ఇలా 2.ఓ విడుదల వాయిదాలతో రజనీ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. తాజాగా మరోసారి 2.ఓ వాయిదా పడింది. ఎకంగా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో చిత్ర విడుదలను నాలుగోసారి వాయిదా వేయవలసి వచ్చిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. 2.ఓను జనవరిలో విడుదల చేస్తే, కాలా ను నిర్మాత ధనుష్ ఏప్రిల్‌లో విడుదల చేయవచ్చనే భావనతో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment