
కథ వినకుండానే మహేశ్ సినిమా ఒప్పేసుకున్నా!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళుతోంది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళుతోంది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఏ స్టార్ హీరో సినిమా ఆరంభమవుతున్నా కథానాయికగా రకుల్ పేరు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయగలనన్ని సినిమాలు ఒప్పుకుంటూ రకుల్ కూడా బిజీ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఒప్పుకున్న మహేశ్‌బాబు సినిమాతో పాటు ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఐదారు సినిమాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా తనకు దక్కదనే అనుకున్నారట. ఆ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే చర్చ బాగా జరిగింది. పరిణీతి చోప్రాని తీసుకున్నారనే వార్త కూడా వచ్చింది. దాంతో ఈ సినిమా అవకాశం నాకు దక్కదనుకున్నా. కానీ, నా పేరుని పరిశీలిస్తున్నారని తెలిసింది.
అది విని చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాకి నన్ను అడిగినప్పుడు నేను కాశ్మీర్‌లో ఉన్నాను. హీరోయిన్‌గా నన్ను సెలక్ట్ చేశారనే ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆనందం పట్టలేకపోయాను. ఫోన్ మాట్లాడం పూర్తయ్యాక ఎగిరి గంతేసా. కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నాను. మురుగదాస్ సామాన్యమైన కథలు తయారు చేయరు. ఆయన చాలా సెన్సిబుల్ డెరైక్టర్. మురుగదాస్ సినిమాలు అన్ని వయసులవాళ్లూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయ్. మహేశ్‌బాబు సూపర్ స్టార్. ఈ ఇద్దరితో సినిమా చేయాలనుకునేదాన్ని. లక్కీగా ఒకే సినిమాకి అది నెరవేరింది. ఆ దేవుడికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇంకా రకుల్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఆరంభం కాలేదు. ప్రస్తుతం తాను చేయబోయే పాత్రకు సంబంధించిన శారీరక భాష ఎలా ఉండాలి? అనే విషయం మీద రకుల్ వర్కవుట్ చేస్తున్నారు. త్వరలో ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు.