
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోనికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. షేక్ షావలి సమర్పణలో రజిని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మావురం రజిని నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రకుల్ ప్రీత్‌సింగ్ క్లాప్ ఇచ్చారు. నటి మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘నా సోదరుడు అమన్ హీరోగా సినిమా ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం నాకు హీరో కావాలనుందని చెప్పగానే.. ప్యాషన్ ఉందా? ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి అన్నాను.
ఎంతో పట్టుదలగా తెలుగు నేర్చుకుని తన ప్యాషన్ ఏంటో చూపించాడు’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. అమన్ పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. కథలో భాగంగా మంచి కామెడీ ఉంటుంది. మార్చి మొదటి వారంలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది’’ అని దాసరి లారెన్స్ అన్నారు. ‘‘సంతోషంతో మాటలు రావడం లేదు. చాలా నెర్వస్‌గా, టెన్షన్‌గా ఉంది. తెలుగులో హీరోగా ఎంట్రీ ఇస్తుండటం వెరీ హ్యాపీ’’ అన్నారు అమన్. ‘‘మార్చి ఫస్ట్ వీక్‌లో మా సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని మావురం రజిని అన్నారు. నటుడు రావు రమేష్, మోనికా శర్మ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.ఎన్.బాబు, సంగీతం: మోహిత్ రెహమానిక్, సహ నిర్మాత: పి.వెంకటేశ్వర్లు.