టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ స్పందించింది. తెలుగు ఇండస్ట్రీలో తనకు అలాంటి పరిస్థితులేవీ ఎదురు కాలేదని ఆమె స్పష్టత ఇచ్చేసింది. గత కొద్ది రోజులుగా మాధవీ లతా, శ్రీరెడ్డిలు తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రకుల్ స్పందిస్తూ అలాంటిదేం లేదని చెప్పింది. దీంతో వాళ్లిద్దరూ రకుల్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు శ్రీరెడ్డి వ్యవహారం మా కు చేరటం.. టీవీ ఛానెళ్లలో డిబేట్లతో ఈ వ్యవహారం కూడా ముదురుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ స్పందించింది.
‘నేను నా గురించి మాత్రమే చెబుతున్నా. ఇతరుల సంగతి నాకు తెలీదు. ఆరోపణలు చేస్తున్న వాళ్లు ఎన్ని చిత్రాల్లో నటించారో.. వాళ్లకే తెలియాలి. అయినా వాళ్లపై గౌరవంతో మాట్లాడుతున్నా. నేను.. నా అనుభవాల గురించి మాత్రమే చెబుతున్నా. నాకు కాస్టింగ్ కౌచ్ అనుభూతి ఎదురుకాలేదు. అలాంటప్పుడు దాని గురించి నేనేం మాట్లాడగలను?. ఒకవేళ నేను అబద్ధాలు చెబుతున్నా అని వారనుకుంటే నేనేం చేయలేను. నేను నా మాట మీదే నిలబడుతున్నా. నన్ను ఎవరూ వేధించలేదు’ అని రకుల్ సుదీర్ఘ వివరణ ఇచ్చుకుంది. ‘అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఎదురు చూడాలి. అంతేగానీ తప్పుడు మార్గాలను ఆశ్రయించకూడదు. ఇదే నేనిచ్చే సలహా’ అని రకుల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment