కృష్ణవంశీ దర్శకత్వంలో చెర్రీ?
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి ఫిలిమ్‌నగర్ వర్గాలు. ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని రెండేళ్ల నుంచే వార్తలు ఊరిస్తున్నాయి. అయితే రకరకాల కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ కాస్తా వాయిదా పడుతూ వస్తోంది.
ఎట్టకేలకు ఈ కాంబినేషన్ ఓ కొలిక్కి వచ్చిందన్నది సమాచారం. కృష్ణవంశీ చెప్పిన కథ చరణ్‌ని బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే పచ్చజెండా ఊపారని తెలిసింది. చరణ్‌కి వ్యక్తిగతంగా కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభపై అపారమైన గౌరవం. ఆయన ఆర్టిస్టుల్ని డీల్ చేసే విధానం, హీరోల్ని న్యూ లుక్‌లో ప్రెజెంట్ చేసే శైలి తనకిష్టమని చరణ్ ఓ సందర్భంలో చెప్పారు.
అందుకే చరణ్, కృష్ణవంశీ ప్రాజెక్ట్‌ని వెంటనే ఓకే చేశారని తెలిసింది. చరణ్ ఇమ్మీడియట్‌గా చేయబోయే సినిమా ఇదే అవుతుందట. కృష్ణవంశీ కూడా ఈ కథపై భారీ కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, బండ్ల గణేష్‌ల్లో ఎవరో ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉన్నదని సమాచారం.