
రెడీ... స్టార్ట్...యాక్షన్!
ఇక నాలుగు రోజులు మాత్రమే రామ్‌చరణ్ ఖాళీగా ఉంటారు. ఆ తర్వాత ఫుల్ బిజీ. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రం తాజా షెడ్యూల్ ఈ 22న హైదరాబాద్‌లో మొదలు కానుంది. తమిళ చిత్రం ‘తని ఒరువన్’కి రీమేక్‌గా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంలో అరవింద్ స్వామి కనిపించే కొన్ని దృశ్యాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రవిశేషాలను అల్లు అరవింద్ చెబుతూ- ‘‘క్యారెక్టర్ పరంగా స్టన్నింగ్ లుక్‌తో రామ్‌చరణ్ అభిమానులను అలరించనున్నాడు. సురేందర్‌రెడ్డి స్టైలిష్ మేకింగ్‌ని మరోసారి చూస్తారు. అరవింద్‌స్వామి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రకుల్ ప్రీత్‌సింగ్ నటన, అందచందాలు అదనపు ఆకర్షణ. రామ్‌చరణ్, రకుల్ ఆల్రెడీ మంచి పెయిర్ అనిపించుకున్నారు.
ఈ చిత్రంతో మరోసారి ఆకట్టుకుంటారు. చరణ్, సురేందర్‌రెడ్డి, నా కాంబినే షన్‌లో వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. హైదరాబాద్ షెడ్యూల్‌లో యాక్షన్, టాకీ తీస్తాం. జూన్ 20 నుంచి కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అని తెలిపారు. నాజర్, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: అసీమ్ మిశ్రా, సంగీతం: ‘హిప్ హాప్’ ఆది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వీవై ప్రవీణ్ కుమార్, సహ నిర్మాత: ఎన్‌వి ప్రసాద్.