నా స్వార్థంతోనే ధృవ తీశా..
‘‘చాలా మంది హీరోలు సెట్స్‌కి వచ్చామా.. డైరెక్టర్ చెప్పినట్లు చేశామా.. వెళ్లిపోయామా.. అన్నట్టు ఉంటారు. కానీ, చరణ్‌లో నాకు నచ్చే విషయం ఏంటంటే... సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ కూలంకషంగా డిస్కస్ చేస్తాడు. అందువల్ల కంటెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. అవుట్‌పుట్ కూడా బాగుంటుంది. నిర్మాతకు ఏ విధమైన అభద్రతాభావం ఉండదు. మా ‘ధృవ’ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి అల్లు అరవింద్ పలు విశేషాలను పంచుకున్నారు.
ఈ చిత్రంలో హీరో పాత్రతో సమానంగా విలన్ (అరవింద్ స్వామి) పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకో హీరో అయితే నా పాత్ర పరిధి పెంచండి, నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండాలి అనేవారేమో. కానీ, చరణ్ మాత్రం ఎటువంటి డిస్కషన్స్ పెట్టలేదు. ‘తని ఒరువన్’ ఒరిజినల్‌లో పెద్ద మార్పులేమీ చేయొద్దన్నాడు. అందుకే సినిమాలో అరవింద్‌స్వామి పాత్రకూ అంత ఇంపార్టెన్స్ ఉంది. యాక్టింగ్, మేకోవర్ పట్ల చరణ్ ఎంతో శ్రద్ధ తీసుకుని సినిమా బాగా రావాలనే తపనతో వర్క్ చేశాడు. టీమ్ అందర్నీ కలుపుకుని వర్క్ చేయించాడు. దర్శకుడు సురేందర్ రెడ్డిని ఎంత బాగా ఎంకరేజ్ చేశాడో నాకు తెలుసు.
► ‘మగధీర’, ఇప్పుడు ‘ధృవ’.. చరణ్‌తో రెండు సినిమాలు నిర్మించా. తన కెరీర్ గ్రాఫ్ చూస్తే.. అందులో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాలూ నావే ఉండాలనే స్వార్థంతో ‘ధృవ’ తీశా. ఈ సినిమా ప్లాన్ చేసినప్పుడు ‘మగధీర’ కంటే ఎక్కువ వసూలు చేయాలనీ, చరణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మరో సినిమా కావాలనీ అనుకున్నా. సినిమా సూపర్‌హిట్. వసూళ్లు గురించి ఈ వారాంతం తర్వాత మాట్లాడితేనే బాగుంటుంది. శని, ఆదివారాల్లో వసూళ్లు బాగుంటాయి కదా.
► ‘ధృవ’కు కంటెంట్ ఈజ్ కింగ్. కథా బలం ఉండటంతో నోట్ల రద్దు కలెక్షన్స్‌పై ప్రభావం చూపదని నా బలమైన నమ్మకం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం కూడా కథా బలంతోనే బాగా ఆడింది. ‘ధృవ’ విడుదల తర్వాత అన్ని చోట్లా వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఓవర్‌సీస్‌లోనూ వసూళ్లు చాలా బాగున్నాయి. ‘ఏ’ సెంటర్లలో వసూళ్లపై నోట్ల రద్దు ప్రభావం అంత లేకపోయినా, ‘బి, సి’ సెంటర్లలో మాత్రం కచ్చితంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి మా సినిమా కలెక్షన్స్ చూస్తే 10 నుంచి 20 శాతం నోట్ల రద్దు ప్రభావం ఉందని అర్థమైంది. లేకపోతే, వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవనడంలో సందేహం లేదు.
► ‘ధృవ’ విడుదల గురించి నేను, చరణ్ చాలా డిస్కస్ చేసుకున్నాం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పుడు సినిమా విడుదల చేస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందేమో? అన్నాడు చరణ్. పోనీ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే అప్పుడు చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ వస్తుంది. ఆ తర్వాత అంటే సమ్మర్‌లోనే. అంత గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేక డిసెంబర్‌లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం.
► ‘వసూళ్లపై ప్రభావం పడితే.. ఆ రిస్క్ ఏదో నేనే పడతాను’ అని చరణ్‌కి చెప్పా. ముందుగా డిసెంబర్ 2న రిలీజ్ అనుకున్నాం. అయితే, నెల మొదట్లో అంటే జనాలకు డబ్బుల ఇబ్బంది ఉంటుంది. 9న అయితే వారం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉండదని చరణ్ చెప్పడంతో.. నిజమే కదా అనిపించి 9న విడుదల చేశాం. అయితే ఒకటి మాత్రం చెప్పాలి.. చరణ్ మానిటరింగ్ లేకపోతే ఈ సినిమా తీసేవాణ్ణి కాదు.